Hyderabad: నేపాలీ కల్పన నేర ప్రస్థానం.. ఐఏఎస్ అధికారి భార్య హత్య కేసులో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews

నేపాలి పనిమనిషి కల్పన


Last Updated:

పక్కా స్కెచ్‌తో దోపిడీలకు పాల్పడే ఒక ‘మాయలేడి’ అని పోలీసుల విచారణలో తేలింది. నేపాలీ మూలాలున్న కల్పన అనే ఈ నిందితురాలి నేర చరిత్ర ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

నేపాలి పనిమనిషి కల్పన
నేపాలి పనిమనిషి కల్పన

Hyderabad: భాగ్యనగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ (81)ను కిరాతకంగా హతమార్చిన ఘటన వెనుక ఉన్నది ఒక సామాన్య పనిమనిషి కాదు, పక్కా స్కెచ్‌తో దోపిడీలకు పాల్పడే ఒక ‘మాయలేడి’ అని పోలీసుల విచారణలో తేలింది. నేపాలీ మూలాలున్న కల్పన అనే ఈ నిందితురాలి నేర చరిత్ర ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

నమ్మించి నట్టేట ముంచిన నేపాలీ గ్యాంగ్

ఈనాడు కథనం ప్రకారం.. ప్రధాన నిందితురాలు కల్పన సుమారు 8 నెలల క్రితం వినయ్ రంజన్ రే ఇంట్లో పనిమనిషిగా చేరింది. అప్పటి నుంచి యజమానుల నమ్మకాన్ని చూరగొన్న ఆమె, లోలోపల మాత్రం భారీ దోపిడీకి వ్యూహం రచించింది. ఈ క్రమంలోనే పూణెకు చెందిన సురేష్ అనే వ్యక్తితో నిత్యం టచ్‌లో ఉంటూ ఆదేశాలు అందుకునేది. యజమాని వినయ్ రంజన్ రే పని నిమిత్తం బెంగళూరు వెళ్లడమే కల్పనకు కలిసొచ్చింది. వెంటనే తన గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులను పూణె నుంచి హైదరాబాద్ రప్పించింది. ఐదు రోజుల పాటు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించి, సీసీ కెమెరాల కళ్లు గప్పి ఎలా పారిపోవాలనే దానిపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

అర్ధరాత్రి దారుణం.. పక్కా ప్లాన్‌తో పరారీ

గురువారం అర్ధరాత్రి తనూజను దారుణంగా హతమార్చిన ఈ ముఠా, బీరువాలోని విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించింది. నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అత్యంత తెలివిగా వ్యవహరించారు. నిందితులు తొలుత ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. పోలీసులు వారు నాగపూర్ వైపు వెళ్తారని భావించి అక్కడ నిఘా పెట్టగా, కల్పన తన తెలివితేటలతో మధ్యలోనే అంటే కాజీపేట స్టేషన్‌లో రైలు దిగి తప్పించుకుంది. అక్కడి నుంచి బస్సు మార్గంలో ముంబయి లేదా దిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకే సవాల్

నిందితురాలు కల్పన అత్యంత సామాన్యురాలిగా కనిపిస్తున్నా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులను తికమక పెడుతోంది. హత్య చేసిన వెంటనే పాత ఫోన్లను పారేసి, కొత్త ఫోన్లు, సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు సమాచారం. పోలీసుల నెట్‌వర్క్‌కు దొరకకుండా ఉండేందుకు ఆమె ఎప్పటికప్పుడు తన మార్గాలను మార్చుకుంటోంది. ప్రస్తుతానికి పూణెలో ఉన్న ఆమె తల్లిదండ్రులు, సోదరి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కల్పనకు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

మల్టీ-సిటీ నేరగాళ్లు..

కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా, గతంలో బెంగళూరులో కూడా కల్పన ముఠా ఇలాంటి దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. అక్కడ నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ కార్డులతో పని మనుషులుగా చేరి, అదను చూసి దోపిడీలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. జూబ్లీహిల్స్ హత్య కేసులో నిందితురాలి వివరాలను ఇప్పుడు బెంగళూరు, ముంబయి, పూణె పోలీసులకు కూడా చేరవేశారు.

ఈ ‘మాయలేడి’ కల్పనను పట్టుకోవడం ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు సవాలుగా మారింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ వంటి హై-ప్రొఫైల్ ఏరియాలో పని మనుషుల వివరాల సేకరణ (Police Verification) ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. అపరిచిత వ్యక్తులను పనిలో పెట్టుకునేటప్పుడు వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు నగర ప్రజలను కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *