Vande Mataram: తమిళనాడులో అలా.. కేరళలో ఇలా.. ‘వందేమాతరం’పై ఇరు రాష్ట్రాల్లో భిన్న పరిణామాలు | | ACTPnews

విజయ్, కేరళ అసెంబ్లీ


Last Updated:

ఒకవైపు తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో వందేమాతరం గేయానికి సముచిత గౌరవం దక్కగా, మరోవైపు కేరళ అసెంబ్లీలో మాత్రం ఈ గేయాన్ని కుదించి కేవలం కొన్ని లైన్లు మాత్రమే ప్లే చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

విజయ్, కేరళ అసెంబ్లీ
విజయ్, కేరళ అసెంబ్లీ

Vande Mataram: దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో జాతీయ గేయమైన ‘వందేమాతరం’ (Vande Mataram) ఆలపించే విషయంలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు, రాజకీయ చర్చలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో వందేమాతరం గీతానికి సముచిత గౌరవం దక్కగా, మరోవైపు కేరళ అసెంబ్లీలో మాత్రం ఈ గేయాన్ని కుదించి కేవలం కొన్ని లైన్లు మాత్రమే ప్లే చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

తమిళనాడులో సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత, ఆ పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్) మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ అత్యంత వైభవపూర్వక వేడుకలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నూతన ప్రభుత్వంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ అధికారిక కార్యక్రమంలో భాగంగా వందేమాతరం గీయాన్ని పూర్తిగా ఆలపించడం విశేషం. ద్రవిడ పార్టీల ఐదు దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించుతూ అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వం, ఈ జాతీయ గేయాలాపనతో తమ సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది.

కేరళ అసెంబ్లీలో వందేమాతరం వివాదం

పొరుగు రాష్ట్రమైన కేరళలో వందేమాతరం గేయాన్ని తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. కేరళలో నూతనంగా ఏర్పాటైన 16వ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాలసీ ప్రసంగానికి ముందు కేరళ పోలీస్ బ్యాండ్ వందేమాతరం గేయాన్ని పూర్తిగా కాకుండా కేవలం రెండు చరణాలు మాత్రమే ప్లే చేసింది. గవర్నర్ హాజరయ్యే అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించాలనే నిబంధన, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ (UDF) ప్రభుత్వం దానిని కుదించడంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన లోక్‌భవన్ (రాజ్‌భవన్) అధికారుల ద్వారా స్పీకర్ తిరువాంచూర్ రాధాకృష్ణన్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది స్పష్టమైన ప్రోటోకాల్ ఉల్లంఘన అని పేర్కొన్నారు.

రాజకీయ విమర్శలు – ప్రతివిమర్శలు

ఈ పరిణామంపై కేరళలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుల భావజాలం ప్రకారం వందేమాతరంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే లౌకికత్వానికి ప్రతీకలని, మిగిలిన భాగంలో మతపరమైన అంశాలు ఉన్నందున వాటిని మినహాయించామని ప్రభుత్వ వర్గాలు వాదించాయి. దీనిని సమర్థిస్తూ ప్రతిపక్ష నేత, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ మాట్లాడుతూ.. వందేమాతరం పాడేటప్పుడు లేచి నిలబడాలనే విధివిధానం కూడా లేదని, కూర్చుని కూడా వినవచ్చని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను కేరళలో అమలు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు బిజెపి (BJP) నేత వి. మురళీధరన్ స్పందిస్తూ, వందేమాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో జాతీయ గేయాన్ని కేరళ ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు. సీపీఐ(ఎం), జమాత్-ఎ-ఇస్లామీ ఒత్తిళ్లకు తలొగ్గి ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ప్రభుత్వం జాతీయ భావాలను పక్కనబెట్టిందని ఆయన ఆరోపించారు. మొత్తానికి, పక్కపక్కనే ఉన్న రెండు దక్షిణాది రాష్ట్రాలలో వందేమాతరం గేయాన్ని ఆలపించే విషయంలో కనిపించిన ఈ భిన్నమైన వైఖరులు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *