Hyderabad: పథకం లవర్‌ది.. అమలు కల్పనది.. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ఒక నేపాలీ ప్రేమ కథా చిత్రం! | తెలంగాణ వార్తలు | ACTPnews

నేపాలి పనిమనిషి కల్పన


Last Updated:

నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్‌వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

నేపాలి పనిమనిషి కల్పన
నేపాలి పనిమనిషి కల్పన

Hyderabad: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్‌రే భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌ లాంటి అత్యంత సంపన్న, సురక్షిత ప్రాంతంలో జరిగిన ఈ ఘోరానికి వెనుక ఒక పక్కా క్రిమినల్ స్కెచ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కల్పన అనే నేపాలీ మహిళ తన ప్రియుడు వికాస్ వేసిన భారీ వ్యూహాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్‌వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

నమ్మకంగా చేరి.. నమ్మకద్రోహానికి ఒడిగట్టి

ఈనాడు కథనం ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన కల్పన కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని పుణె నగరానికి చేరింది. అక్కడ జీవనం సాగిస్తూ కొన్ని ఇళ్లలో పనిచేసేది. ఆ సమయంలోనే ఆమెకు వికాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వికాస్ సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో పెద్ద ఎత్తున దోపిడీకి ప్లాన్ చేశాడు. కాగా, గత 8 నెలల క్రితం వరకు వినయ్‌రంజన్‌రే ఇంట్లో మరొక నేపాలీ మహిళ పనిచేసేది. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తన బంధువుల ఇంటికి వెళ్తూ, నమ్మకస్తురాలంటూ కల్పనను ఈ ఇంట్లో పనికి కుదిర్చింది. యజమానుల నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్న కల్పన, ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు, భద్రతా లోపాలను తన ప్రియుడు వికాస్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చింది.

9 మంది నేపాలీయులతో ముఠా ఏర్పాటు

చోరీ చేయడానికి సమయం ఆసన్నమైందని భావించిన వికాస్, ఒక ముఠాను రంగంలోకి దించాడు. దోపిడీకి కొద్దిరోజుల ముందే పుణె, ముంబయి, బెంగళూరు నగరాల్లో వేర్వేరుగా నివసిస్తున్న ఎనిమిది మంది నేపాలీ యువకులను హైదరాబాద్‌కు రప్పించాడు. విచిత్రం ఏమిటంటే, ఈ ఎనిమిది మందికి ఒకరికొకరు అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాతే వీరంతా వికాస్ ద్వారా ఒక ముఠాగా ఏర్పడ్డారు. కల్పన, వికాస్, ఈ 8 మంది కలిపి మొత్తం 9 మంది సభ్యులు ప్రశాసన్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు నిశితంగా రెక్కీ నిర్వహించారు. ఏ సమయంలో ఇంట్లో ఎవరు ఉంటారు, ఎలా లోపలికి ప్రవేశించాలి, ఏ మార్గం ద్వారా పారిపోవాలనే విషయాలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు.

హత్య, దోపిడీ అనంతరం పక్కా ప్లాన్‌తో పరారీ

పథకం ప్రకారం కల్పన ఇంట్లోని ఇతర సభ్యులు లేని సమయం చూసి ముఠా సభ్యులను లోపలికి ఆహ్వానించింది. అడ్డువచ్చిన యజమానురాలు తనూజను దారుణంగా హత్య చేసి, ఇంట్లోని భారీ సొత్తును దోచుకున్నారు. నేరం చేసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వీరు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. జూబ్లీహిల్స్ నుంచి నేరుగా ఒక ఆటో ఎక్కి నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి కాజీపేటలో దిగారు. రైల్వే స్టేషన్ దాటి బయటకు రాగానే, టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తమను ట్రాక్ చేయకుండా ఉండేందుకు అందరి సెల్‌ఫోన్లను పగలగొట్టి పక్కన పడేశారు. ఆ తర్వాత కొట్టేసిన బంగారు నగలు, నగదును అందరూ సమానంగా పంచుకున్నారు.

పోలీసుల వేట.. ముంబయిలో ఒకరి అరెస్ట్

ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కాజీపేట రైల్వేస్టేషన్‌లో వేర్వేరుగా నాలుగు, ఐదు రైళ్లు ఎక్కి దిగుతూ, చివరికి తలో దిక్కుకు పారిపోయారు. ప్రధాన నిందితురాలు కల్పన ఇప్పటికే సరిహద్దులు దాటి నేపాల్ చేరుకున్నట్లు పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. మరోవైపు, దోపిడీ విజయవంతంగా పూర్తయిందని తెలియగానే పుణెలో ఉన్న ప్రియుడు వికాస్ సైతం నేపాల్‌కు పారిపోయాడు. అయితే, హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక బృందాలు నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే ముఠా సభ్యుల్లో ఒకడైన సునీల్ అనే నిందితుడిని మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు తన భార్యతో కలిసి దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. ప్రస్తుతం సునీల్‌ను హైదరాబాద్‌కు తరలించి విచారిస్తున్నారు. కల్పన, వికాస్‌లను పట్టుకునేందుకు నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *