Hyderabad: సినిమా చూసి… కేక్ కట్ చేసేందుకు వెళ్తూ… పుట్టిన రోజే ఆ చిన్నారికి చివరి రోజయింది! | తెలంగాణ వార్తలు | ACTPnews

సరాక్షి, విశ్వంత్


Last Updated:

Hyderabad: ఆ చిన్నారి నవ్వులు ఆ కుటుంబానికి వెలుగులు నింపాయి. సరిగ్గా ఆరేళ్లు నిండిన వేళ, కూతురి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా జరపాలని ఆ తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు.

సరాక్షి, విశ్వంత్
సరాక్షి, విశ్వంత్

అందరితో కలిసి సంతోషంగా కేక్ కట్ చేసి కేరింతలు కొట్టాల్సిన ఆ క్షణాల్లోనే విధి వక్రించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ రూపంలో మృత్యువు కబళించడంతో, వేడుకలు జరుపుకోవాల్సిన చోటే విషాద రోదనలు మిన్నంటాయి. దోమలగూడ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్ జోన్సన్‌బండకు చెందిన సాయినాథ్, అశ్విని దంపతులకు శరణ్య, సరాక్షి (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాయినాథ్ స్థానికంగా ఓ మీ-సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకు దగ్గరి బంధువైన విశ్వంత్ (40), అతని భార్య సింధు కూడా అదే కేంద్రంలో పనిచేస్తూ కలిసి జీవిస్తున్నారు. చిన్నారి సదాక్షి ఆరో పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులంతా ఎంతో ఆనందంగా గడిపేందుకు ప్రణాళిక వేసుకున్నారు. శనివారం రాత్రి సాయినాథ్ కుటుంబం, విశ్వంత్ దంపతులు కలిసి కూకట్‌పల్లిలోని థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు. సినిమా ముగిసిన అనంతరం, అర్ధరాత్రి వేళ చల్లని వాతావరణంలో హుస్సేన్‌సాగర్ అందాల నడుమ ట్యాంక్‌బండ్‌పై కేక్ కట్ చేసి చిన్నారికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించారు.

తండ్రి కేక్ తెచ్చేలోపే ఘోరం..

ఆదివారం వేకువజామున సుమారు 2:15 గంటల సమయంలో వారు ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం సమీపానికి చేరుకున్నారు. రోడ్డు పక్కన కారును నిలిపిన సాయినాథ్, డిక్కీలో ఉన్న బర్త్‌డే కేక్‌ను బయటకు తీసేందుకు వెళ్లారు. అదే సమయంలో విశ్వంత్ చిన్నారి సరాక్షిని ఎత్తుకుని రోడ్డు దాటుతున్నారు. సరిగ్గా ఆ క్షణంలో సికింద్రాబాద్ వైపు నుంచి విపరీతమైన వేగంతో దూసుకొచ్చిన లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు చిన్నారి, విశ్వంత్ ఇద్దరూ గాల్లోకి ఎగిరి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. కళ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి కుటుంబసభ్యులు హాహాకారాలు చేశారు.

ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు గాల్లోకి..

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి సరాక్షిని తండ్రి సాయినాథ్ వెంటనే తన కారులోనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన విశ్వంత్‌ను స్థానికుల సాయంతో ‘108’ అంబులెన్స్‌లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన కూడా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పుట్టినరోజు పూట ముద్దులొలికే బిడ్డ, చేదోడువాదోడుగా ఉండే బంధువు ఒకేసారి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీరని శోకం అలుముకుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports