IND vs JPN: పసికూనల్లో పసికూనతో టీమిండియా పోరు నేడు.. 350 లోడింగ్.. చిచ్చర పిడుగు రెడీ! | క్రీడా వార్తలు | ACTPnews

PC: BCCI


Last Updated:

IND vs JPN: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారత క్రికెట్ జట్టు, అసలు సమరానికి ముందే మరో వినూత్న పోరుకు సిద్ధమైంది.

PC: BCCI
PC: BCCI

ఆసియా క్రీడల ఆతిథ్య దేశమైన జపాన్‌తో టీమ్‌ఇండియా మంగళవారం చరిత్రాత్మక ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. జపాన్ వేదికగా భారత జట్టు మ్యాచ్ ఆడటం ఇదే ప్రప్రథమం. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. జపాన్‌లో క్రికెట్ ఆటకు ఆదరణ పెంచడంతో పాటు, ఇరు దేశాల మధ్య మైత్రీ సంబంధాలను మరింత దృఢతరం చేసేందుకు ఈ మ్యాచ్ ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.

బేస్‌బాల్, జూడో, ఫుట్‌బాల్ వంటి ఇతర అంతర్జాతీయ క్రీడల్లో జపాన్ బలమైన శక్తిగా ఎదిగినప్పటికీ, క్రికెట్‌లో మాత్రం ఇంకా అసోసియేట్ హోదా కలిగిన పసికూనగానే కొనసాగుతోంది. ప్రపంచ క్రికెట్‌లో అగ్రగామిగా వెలుగొందుతున్న టీమ్‌ఇండియాతో తలపడటం జపాన్ క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది.

సానో వేదికగా పోరు.. పరిస్థితులపై అవగాహన

జపాన్ క్రికెట్ రాజధానిగా గుర్తింపు పొందిన సానో నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఈ అరుదైన మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్ సారథ్యంలోని జపాన్ జట్టు, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పటిష్టమైన భారత జట్టుకు ఏమేరకు పోటీ ఇవ్వగలదన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం కంటే కూడా, ఆసియా క్రీడల్లో బరిలోకి దిగడానికి ముందు అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు, గాలి వేగం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్ ఒక గొప్ప అవకాశంగా మారనుంది.

యువ సంచలనాలకు సువర్ణావకాశం

ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్, దేశవాళీల్లో మెరిసి జాతీయ జట్టులోకి వచ్చిన వర్ధమాన ఆటగాళ్లకు అంతర్జాతీయ పరిస్థితుల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఇది మంచి వేదిక కానుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం భారీ స్కోరు నమోదవ్వడం ఖాయం. అంతర్జాతీయ టి20ల్లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఇదే అత్యధిక టి20 స్కోరు. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే ఇది బద్దలవ్వడం ఖాయం. ఇక అభిషేక్, వైభవ్‌లు ఓపెనర్లుగా వస్తే మాత్రం జపాన్‌కు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం.

ప్రయోగాలకు వేదిక

శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొత్త కలయికలను పరీక్షించుకోవాలని యోచిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. జపాన్ బౌలర్లను భారత బ్యాటర్లు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడటంతో పాటు, ఆసియా క్రీడల ప్రధాన మ్యాచ్‌లకు ముందు జట్టు సభ్యులందరికీ మ్యాచ్ ప్రాక్టీస్ అందించడమే భారత మేనేజ్‌మెంట్ ముఖ్య ఉద్దేశం. బలాబలాల పరంగా భారత్‌దే పైచేయి అయినప్పటికీ, సరికొత్త పిచ్‌పై జరిగే ఈ వినూత్న పోరు క్రికెట్ ప్రేమికులకు కొత్త అనుభూతిని పంచనుంది. ఈ మ్యాచ్ ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports