Last Updated:
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు సత్తా చాటాయి. శనివారం జరిగిన పురుషుల, మహిళల ఫైనల్ మ్యాచ్‌లలో చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌ను ఓడించి రెండు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలను ముద్దాడాయి.
జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. శనివారం (సెప్టెంబర్ 26) జరిగిన ఫైనల్ పోరులో భారత పురుషుల, మహిళల జట్లు రెండూ చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌ను మట్టికరిపించి స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. స్టార్ ఆటగాడు పవన్ సెహ్రావత్, సునీల్ కుమార్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు హోరాహోరీగా సాగిన తుది పోరులో 2018 ఛాంపియన్ ఇరాన్‌పై 40-34 తేడాతో అద్భుత విజయం సాధించింది.
తద్వారా ఆసియా క్రీడల పురుషుల కబడ్డీ చరిత్రలో భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పసిడి పతకాన్ని ముద్దాడింది. 1990లో ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి 2018లో మాత్రమే నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న భారత్, మిగిలిన అన్ని ఎడిషన్లలోనూ స్వర్ణం గెలవడం విశేషం.
ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు ఓటమి అనేదే లేకుండా ఫైనల్ చేరింది. సెప్టెంబర్ 21న జరిగిన గ్రూప్-ఎ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ను 49-24తో ఓడించిన భారత్.. ఆ తర్వాత దక్షిణ కొరియాపై 63-31తో, బంగ్లాదేశ్‌పై 48-25తో, చైనీస్ తైపీపై 37-21 తేడాతో ఘనవిజయాలు సాధించింది.

శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌ను 66-28తో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రెండో సెమీస్‌లో చైనీస్ తైపీని 59-21తో ఓడించి ఫైనల్‌కు వచ్చిన ఇరాన్‌ను తుది మెట్టుపై ఓడించి భారత్ విజేతగా నిలిచింది.

పురుషుల కంటే ముందే బరిలోకి దిగిన భారత మహిళల కబడ్డీ జట్టు సైతం తమ ఆసియా క్రీడల కిరీటాన్ని నిలబెట్టుకుంది. టోకాయ్ సిటిజన్స్ జిమ్నాజియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పుష్ప రాణా సారథ్యంలోని భారత మహిళల జట్టు 37-34 తేడాతో ఇరాన్‌పై గెలిచి రికార్డు స్థాయిలో నాలుగో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. చివరి నిమిషాల్లో ఇరాన్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పూజ, సంజు దేవి కీలక రైడ్లతో రాణించి భారత్‌కు విజయాన్ని అందించారు.

2010 గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన ఐదు టోర్నీల్లో భారత్ నాలుగుసార్లు పసిడి గెలిచింది. కేవలం 2018 జకార్తా క్రీడల ఫైనల్లో మాత్రమే ఇరాన్ చేతిలో ఓడింది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో చోటు ఆశిస్తున్న కబడ్డీ క్రీడలో భారత్‌కు ఇరాన్ అతిపెద్ద ప్రత్యర్థిగా ఎదిగినప్పటికీ, శనివారం జరిగిన ఫైనల్లో మాత్రం కీలక సమయాల్లో అనుభవలేమితో ఇరాన్ మూల్యం చెల్లించుకుంది. గ్రూప్ దశలోనే ఇరాన్‌ను 37-23తో ఓడించిన భారత అమ్మాయిలు.. ఆ మ్యాచ్‌లో గుర్తించిన ఇరాన్ ఎడమవైపు డిఫెన్స్ బలహీనతను ఫైనల్లోనూ తెలివిగా వాడుకుని బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.














