IPL 2026: ఊరించి ఉసూరుమనిపించిన చూయింగమ్ స్టార్.. ఇలా అయితే ఎలా బాసూ.. రిటైర్ అయ్యి బబుల్ గమ్ షాప్ పెట్టుకో! | క్రీడా వార్తలు | ACTPnews

Pc : IPL


Last Updated:

కేకేఆర్ అన్‌క్యాప్డ్ పేసర్ సౌరభ్ దూబే వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో బంతిని పుల్ చేయబోయిన సూర్యకుమార్.. దానిని నేరుగా తన వికెట్ల మీదికి ఆడుకుని బౌల్డ్ అయ్యాడు.

Pc : IPL
Pc : IPL

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ కేవలం 15 పరుగులు (6 బంతుల్లో) మాత్రమే చేసి నిరాశపరిచాడు. కేకేఆర్ అన్‌క్యాప్డ్ పేసర్ సౌరభ్ దూబే వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో బంతిని పుల్ చేయబోయిన సూర్యకుమార్.. దానిని నేరుగా తన వికెట్ల మీదికి ఆడుకుని బౌల్డ్ అయ్యాడు.

కొన్ని నెలల క్రితమే భారత జట్టును టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిపి, టైటిల్‌ను డిఫెండ్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్‌లో మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. భవిష్యత్తులో భారత టీ20 జట్టు నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల నడుమ, కెప్టెన్ ఫామ్ కోల్పోవడం ముంబై ఇండియన్స్‌తో పాటు భారత క్రికెట్ వర్గాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. అభిమానులు అయితే చూయింగమ్ నమలడం తప్ప నువ్వు చేసిందేం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలానే జరిగితే అతడు ముంబై ఇండియన్స్‌లోనే కాదు.. టీమిండియాలో కూడా చోటు కోల్పోవడం ఖాయం.

కుప్పకూలిన ముంబై టాప్ ఆర్డర్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్‌ను అద్భుతంగా వాడుకున్న కేకేఆర్ బౌలర్లు ముంబై టాప్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామరూన్ గ్రీన్ తన మొదటి ఓవర్‌లోనే ముంబైకి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6)ను మనీష్ పాండే పట్టిన అద్భుత క్యాచ్‌తో అవుట్ చేయగా, ఆ తర్వాత వచ్చిన నమన్ ధీర్‌ను డకౌట్ (0) చేశాడు.

మరో ఎండ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబే ముంబైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. క్రీజులో కుదురుకుంటున్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (15) దూబే బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడబోయి మిడ్‌వికెట్ వైపు గ్రీన్‌కు దొరికిపోయాడు. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ (15) కూడా దూబే బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ముంబై ఇండియన్స్ పవర్‌ప్లే ముగిసేసరికి 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

వర్షం అంతరాయం

ఈ దశలో తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ముంబై స్కోరు 8 ఓవర్లలో 57/4 వద్ద ఉన్నప్పుడు వర్షం రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. వర్షం తగ్గాక ఆట ప్రారంభం కాగా.. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అయితే 20 పరుగులు (32 బంతుల్లో) చేసిన తిలక్ వర్మను కార్తీక్ త్యాగి అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

ఆ తర్వాత విల్ జాక్స్ క్రీజులోకి వచ్చాడు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 26 పరుగులు చేసి వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ స్పిన్ మాయాజాలానికి బౌల్డ్ అయ్యాడు. అనంతరం విల్ జాక్స్ 14 పరుగులు చేసి రింకూ సింగ్ చేతిలో రనౌట్ అయ్యాడు. చివర్లో వచ్చిన కార్బిన్ బాష్ వేగంగా ఆడి ముంబైకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బాష్ కేవలం 18 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 32 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో కామరూన్ గ్రీన్ (2/23), సౌరభ్ దూబే (2/34) చెరో రెండు వికెట్లు తీశారు.

కేకేఆర్ అద్భుత ఛేదన.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా ప్రారంభంలో షాక్‌లు తగిలాయి. స్టార్ ఓపెనర్ ఫిన్ అలెన్‌ను దీపక్ చాహర్ మొదటి ఓవర్‌లోనే బౌల్డ్ చేశాడు. కెప్టెన్ అజింక్యా రహానే 21 పరుగులు చేయగా, కామరూన్ గ్రీన్ (4) కార్బిన్ బాష్ బౌలింగ్‌లో తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్ జంట కేకేఆర్‌ను ఆదుకుంది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మనీష్ పాండే 33 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాగా, రోవ్‌మన్ పావెల్ 30 బంతుల్లో 40 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అల్లా గజన్‌ఫర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తేజస్వి సింగ్ (11) కార్బిన్ బాష్‌కు మూడో వికెట్‌గా దొరికిపోయాడు. చివర్లో రింకూ సింగ్ బౌండరీ కొట్టి కేకేఆర్‌ను విజ తీరాలకు చేర్చాడు. కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ రేసులో నిలవగా, ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఇది 9వ ఓటమి.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *