Last Updated:
ఐపీఎల్ 2026 కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న భారీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ దందా వెనుక ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానుల ఆదరణను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు భారీ దందాకు తెరలేపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌ల కోసం ఉచితంగా ఇచ్చే కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా స్టేడియం బయట ఈ టికెట్లను విక్రయించేందుకు యత్నిస్తున్న ముకీమ్, గుఫ్రాన్, ఎండీ ఫైసల్ అనే ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ముఠా వెనుక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు చెందిన ఒక ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రతి మ్యాచ్‌కు దాదాపు 1000 నుంచి 1200 ఉచిత పాస్‌లను ఈ ముఠా బ్లాక్‌లో అక్రమంగా విక్రయించినట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో సాగుతున్న ఈ దందాలో పెట్రోల్ బంక్ ఉద్యోగి పంకజ్ యాదవ్ పాత్ర కూడా బయటపడటంతో అతడిని విచారించారు. అనంతరం ఈ వ్యవహారంపై డీడీసీఏ అధికారులను పిలిపించి సుమారు నాలుగు గంటల పాటు పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
అభిమానుల డిమాండ్, ఆడే జట్లు, స్టార్ ఆటగాళ్లను బట్టి వీరు టికెట్ల ధరలను నిర్ణయించారు. ఒక్కో కాంప్లిమెంటరీ టికెట్‌ను కనిష్టంగా రూ. 8,000 నుంచి గరిష్టంగా రూ. 80,000 వరకు బ్లాక్‌లో అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఆ మ్యాచ్ టికెట్లను ఏకంగా రూ. 80,000కు పైగా విక్రయించి కాసులు దండుకున్నారు.
నిబంధనల ప్రకారం, స్టేడియం సామర్థ్యంలో పది నుంచి పదిహేను శాతం కాంప్లిమెంటరీ పాస్‌లను ఆతిథ్య క్రికెట్ సంఘానికి ఫ్రాంచైజీలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన డీడీసీఏకు ప్రతి మ్యాచ్‌కు సుమారు 6,000 ఉచిత పాస్‌లు వచ్చాయి. అందులో 4,000 పాస్‌లను తమ సభ్యులకు పంపిణీ చేశారు.
మిగిలిన పాస్‌లను బ్లాక్‌లో అమ్మేందుకు సదరు డీడీసీఏ ఉన్నతాధికారి పెట్రోల్ బంక్ ఉద్యోగికి రహస్యంగా అప్పగించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ కుంభకోణంలో ఇంకెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 17, 2026 10:32 PM IST













