Last Updated:
వైభవ్ సూర్యవంశీ ఆటతీరు ముందు జైస్వాల్ ప్రతిభ మరుగున పడిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని వదిలిపెట్టి వేరే జట్టుకు వెళ్లడమే మంచిదని రాయుడు అభిప్రాయపడ్డాడు.
IPL 2026: కేవలం రెండు ఐపీఎల్ సీజన్లు ఆడాడో లేదో అప్పుడే 15 ఏళ్ల బీహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) లీగ్‌లోనే పోస్టర్ బాయ్‌గా మారిపోయాడు. ఎందరో దిగ్గజాలు, ఏళ్ల తరబడి నిలకడగా ఆడుతున్న సీనియర్ స్టార్లు ఉన్న ఈ టోర్నీలో.. ఈ చిన్న వయసులోనే వైభవ్ సృష్టిస్తున్న పరుగుల సునామీ క్రికెట్ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అయితే, వైభవ్ సంచలన ఎదుగుదల నేపథ్యంలో అతని రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్‌మేట్, టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) భవిష్యత్తుపై భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఆటతీరు ముందు జైస్వాల్ ప్రతిభ మరుగున పడిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని వదిలిపెట్టి వేరే జట్టుకు వెళ్లడమే మంచిదని రాయుడు అభిప్రాయపడ్డాడు.
ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో’ చర్చా కార్యక్రమంలో అంబటి రాయుడు మాట్లాడుతూ… “జైస్వాల్ తన ఆట శైలిని మార్చుకోవాలి. ఎందుకంటే వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నంత కాలం జైస్వాల్ ప్రతి మ్యాచ్‌లోనూ అతని నీడన ఉండిపోవాల్సి వస్తుంది. జైస్వాల్ స్వతహాగానే ఒక పెద్ద స్టార్. అతను గనుక వేరే జట్టుకు వెళితే ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు. అతనికి తగినంత స్పేస్, ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్ అవసరం. ఎందుకంటే ఈ కుర్రాడు (వైభవ్) ఇలాగే ఆడుతూ అందరినీ వెనక్కి నెట్టేస్తాడు” అని విశ్లేషించాడు.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ నమ్మశక్యం కాని రీతిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 242.85 సంచలన స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండుసార్లు కేవలం 90లలో (నైంటీస్) అవుటయ్యాడు. ఈ వయసు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ గణాంకాలు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైనవి. పైగా ఇది అతని ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభ దశ మాత్రమే. త్వరలోనే అతను టీమిండియా తరపున అరంగేట్రం చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు యశస్వి జైస్వాల్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన అతికొద్ది మంది భారతీయ బ్యాటర్లలో జైస్వాల్ ఒకడు. ఐపీఎల్ లో కూడా జైస్వాల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్ లో 152.92 స్ట్రైక్ రేట్‌తో 2,500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
రాజస్థాన్‌లో వైభవ్‌తో పోటీ పడటం కంటే జైస్వాల్‌కు ఏ జట్టు సరిపోతుందో కూడా రాయుడు సూచించాడు. “జైస్వాల్ పక్కన ఒక సీనియర్ భాగస్వామి ఉండాలి, అతను జైస్వాల్ ఎదుగుదలకు మద్దతుగా నిలుస్తూ ఎలాంటి ఇగో (Ego) సమస్యలు లేకుండా ఉండాలి. వైభవ్‌తో మనం పోటీ పడలేం. అందుకే జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్ (MI) ఒక అద్భుతమైన జట్టు కాగలదు” అని రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్-2 లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న తరుణంలో, రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













