Last Updated:
Iran News: పదే పదే బెదిరించడమే తప్ప.. చేతల్లో ఆ పని చెయ్యకపోతే, అవతలి వాళ్లు దాన్ని లైట్ తీసుకుంటారు. ట్రంప్ విషయంలో ఇరాన్ ఇదే చేస్తోంది. ఆయన పదే పదే బెదిరిస్తూ, వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇలాంటివి చాలా చూశాం అంటూ ఇరాన్ తేలిగ్గా తీసుకుంటోంది. మరోసారి ట్రంప్ అదే చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. అతిపెద్ద దాడికి అమెరికా సిద్ధమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మాటకి అర్థమేంటి? రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన పెద్ద దాడి ఏది? హిరోషిమా, నాగసాకి నగరాలపై జరిగిన అణుబాంబు దాడులే. అవి జరిగింది కూడా ఆగస్టు 6, 9 తేదీల్లో. ఇప్పుడు మళ్లీ ఆ తేదీలు వస్తున్న తరుణంలో.. ఇరాన్‌ని బెదిరించేందుకు ట్రంప్ మళ్లీ అలాంటి దాడుల వ్యాఖ్యలు చేస్తున్నారు. డైరెక్టుగా అణు బాంబు దాడి చేస్తామని చెప్పకపోయినా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద దాడి అని చెప్పడం ద్వారా ఆయన ఇరాన్‌ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు కూడా ఇరాన్‌ని భూమిపై లేకుండా చేస్తామనీ, ఇరాన్ చరిత్రను తుడిచిపెట్టేస్తామనీ.. ఇలా చాలా వార్నింగ్స్ ఇచ్చారు. ఏం చేసినా ఇరాన్ లొంగట్లేదు. ఇది ట్రంప్‌కి అతిపెద్ద తలనొప్పిగా మారిందనుకోవచ్చు.
తాజాగా ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని త్వరగా తెరవాలనీ, లేదంటే తీవ్రమైన దాడులు తప్పవని హెచ్చరించారు. ఐతే.. చర్చల విషయంలో ట్రంప్, ఇరాన్ వాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చర్చలు అనుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ అంటుంటే.. ఇరాన్ మాత్రం.. అసలు చర్చలే జరగట్లేదని అంటోంది. అందువల్ల ఎవరి వాదన రైట్ అన్నది సస్పెన్స్‌గా మారింది. ట్రంప్ మరో అడుగు ముందుకేసి.. చర్చల విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గితే.. ఊరుకునేదే లేదనీ.. తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
ఇరాన్‌ని ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించిన ట్రంప్ మరోసారి 48 గంటల డెడ్‌లైన్ విధించారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో డిసైడ్ అవుతామన్నారు. ఇరాన్ అణు ఆయుధాలు కలిగి ఉండేందుకు అమెరికా ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కానీ ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నట్లు ఇప్పటివరకూ రుజువు కాలేదు. అయినా ట్రంప్ మాత్రం.. ఉన్నాయి అనే కోణంలో మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రకటనలే.. ఉద్రిక్తతను పెంచుతున్నాయిు.
ఈ సంవత్సరం నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తే.. అది నెక్ట్స్ రెండేళ్ల ట్రంప్ పాలనపై నెగెటివ్ ప్రభావం చూపిస్తుంది. ఇరాన్ కూడా అమెరికాను అస్సలు లెక్కచెయ్యని పరిస్థితి రాగలదు. డాలర్ విలువ కూడా పడిపోగలదు. ఈ పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమస్యగా మారగలవు. అందుకే ట్రంప్.. ఇరాన్ సమస్యను త్వరగా సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ మాత్రం.. ఇలాంటి ఆసక్తి చూపట్లేదు. తమను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన ట్రంప్‌కి చుక్కలు చూపించేందుకే సిద్ధం అనేలా ఇరాన్ వ్యవహరిస్తోంది. ఇదే ట్రంప్‌కి సమస్యగా మారింది. అనవసరంగా ఆయన ఇరాన్‌తో పెట్టుకున్నట్లైంది. ఇప్పుడు ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
హర్మూజ్ జలసంధిలో నౌకలు తిరిగే అంశంపై ఇరాన్, ఒమన్‌తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ అంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో డీల్ కుదరవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పారు. ఇరాన్ మాత్రం తాము చర్చల్లో లేమని చెప్పింది. ఇరాన్‌ని ఎలాగొలా తన దారికి తెచ్చుకునేందుకు ట్రంప్ రకరకాల వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇలాంటివి చాలా చూసి, అలవాటైపోయిన “ఇరాన్.. ఆయన అలాగే అంటారులే” అని లైట్ తీసుకుంటోంది. ఈ పరిస్థితుల మధ్య.. హార్ముజ్ జలసంధి సమస్య అలాగే కొనసాగుతోంది. ఫలితంగా ప్రపంచ చమురు సంక్షోభ సమస్య కూడా కంటిన్యూ అవుతోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














