Last Updated:
ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని తీవ్రవాద శ్రేణులు దేశంలోని కీలక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
Iran President: ఇరాన్ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేస్తూ సుప్రీం లీడర్ కార్యాలయానికి లేఖ సమర్పించారనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. అయితే, ఈ ప్రచారాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ఇవన్నీ కేవలం విదేశీ మీడియా ఆడుతున్న మైండ్ గేమ్‌లని వారు స్పష్టం చేశారు.
ఫాక్స్ న్యూస్, ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని తీవ్రవాద శ్రేణులు దేశంలోని కీలక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దేశానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాల్లో తన ప్రభుత్వానికి ఎలాంటి భాగస్వామ్యం కల్పించడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో తాను సమర్థవంతంగా పాలన సాగించలేనని, తన చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించలేనని చెబుతూ ఆయన తక్షణమే పదవి నుండి తప్పుకోవడానికి అనుమతించాలని సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కార్యాలయానికి లేఖ పంపినట్లు ఆ వార్తల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలు అంతటా వ్యాపించడంతో ఇరాన్ అధ్యక్ష కార్యాలయం వెంటనే స్పందించింది. ప్రెసిడెంట్ కార్యాలయ కమ్యూనికేషన్స్ డిప్యూటీ హెడ్ ‘సయ్యద్ మెహదీ తబాతబాయి’ ఈ నివేదికలను పూర్తిగా తిరస్కరించారు. ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్న ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలను అస్సలు నమ్మవద్దని ఆయన కోరారు.
“ఇరాన్ దేశ సమగ్రతను, జాతీయ ఐక్యతను దెబ్బతీయాలని చూసే విదేశీ నెట్‌వర్క్‌ల కుట్ర ఇది. అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇరాన్ ప్రజలకు సేవ చేయడం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరు. అలాగే దేశ ప్రజలు కూడా ఐక్యత, ప్రతిఘటన మార్గం నుండి తప్పుకోరు. ఇరాన్ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకునే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయి” అని తబాతబాయి స్పష్టం చేశారు. అటు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా కూడా అధ్యక్షుడు పెజెష్కియాన్ ఎలాంటి రాజీనామా చేయలేదని, ఆయన యథావిధిగా తన విధులను నిర్వహిస్తున్నారని వెల్లడించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













