Iran USA Conflict: అమెరికాకు ఇరాన్ ఆఫర్.. ‘ఆ ఆంక్షలు ఎత్తేస్తే హార్ముజ్ జలసంధి ఓపెన్’! | | ACTPnews

News18


Last Updated:

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా తమపై ఉన్న మిలిటరీ ఒత్తిడి, ఆంక్షలు తగ్గిస్తే ఏడు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తెరుస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్‌కు సమాచారం పంపింది.

News18
News18

పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ వాతావరణం మధ్య ఇరాన్ అనూహ్య ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా తమపై ప్రయోగిస్తున్న మిలిటరీ ఒత్తిడిని తగ్గించి, నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తే.. కేవలం ఏడు రోజుల్లోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించిన ఈ సంచలన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త ప్రతిపాదనతో అమెరికాతో మళ్లీ చర్చలు జరిపేందుకు ఇరాన్ పచ్చజెండా ఊపినట్లు స్పష్టమవుతోంది.

ఇరాన్ రేవులపై అమెరికా విధించిన కఠిన ఆంక్షల వల్ల ముడి చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయి. హార్ముజ్ జలసంధి గుండా సాగే సముద్ర రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తాజా నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒప్పందం దిశగా అడుగులు పడే అవకాశం ఉందని ఇరాన్ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సరికొత్త ప్రతిపాదనను ఇరాన్ ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు చేరవేసింది. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో (UNGA) మధ్యవర్తిత్వ దేశాలతో ఈ అంశంపై లోతుగా చర్చించాలని టెహ్రాన్ యోచిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మధ్య నేరుగా భేటీ జరిగే అవకాశాలను ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలమార్గం చుట్టూ జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్లను అమెరికా తక్షణమే నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీనికి బదులుగా జలసంధిని తెరిచి తిరిగి చర్చలు ప్రారంభిస్తామని చెబుతోంది. జలసంధిని తెరవాలంటే రేవులపై ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు తమ స్తంభింపజేసిన ఆస్తులను తిరిగి ఇవ్వాలనే ఏడు కఠిన షరతులను ఇరాన్ గతంలోనే అగ్రరాజ్యం ముందు ఉంచింది. జూన్‌లో కుదిరిన ఇరు దేశాల అవగాహన ఒప్పందం విఫలమయ్యాకే ఈ మిలిటరీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

ఇరాన్ తాజా ప్రకటనతో ప్రపంచ చమురు మార్కెట్లో ఒక్కసారిగా సానుకూల పవనాలు వీచాయి. హార్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుందనే వార్తలతో అంతర్జాతీయ చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 99 డాలర్ల దిగువకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర గరిష్ట స్థాయి నుంచి 3.5 శాతం పైగా పతనం కాగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 2.25 శాతం తగ్గింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed