2025 సంవత్సరానికి సంబంధించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. ఈ అవార్డులన్నింటినీ డిసెంబర్ 2026లోగా ప్రధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. నంది ఫిల్మ్, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని అమరావతి లేదంటే విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దశలవారీగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్‌లో అవార్డుల ఎంపిక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. నవంబర్‌లో అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి.. డిసెంబర్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నంది ఫిల్మ్ అవార్డుల్లో పలు విభాగాలను చేర్చనున్నట్లు తెలిపారు. చలనచిత్రాలు, జాతీయ సమైక్యతపై రూపొందిన చిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై రచించిన ఉత్తమ రచనలు తదితర విభాగాల్లో అవార్డులు అందించనున్నారు.
ఫిల్మ్ విభాగంలో మొత్తం 46 అవార్డులను అందించనున్నట్లు భరత్ భూషణ్ వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి తదితర విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు.
నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికం అందించనున్నారు. వివిధ విభాగాల్లో ఎనిమిది గోల్డ్ మెడల్స్‌ను కూడా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
జాతీయ చలనచిత్ర అవార్డుల విభాగంలోనూ పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందించనున్నారు. ఎన్.టి.ఆర్. నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు, నాగిరెడ్డి–చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డులకు రూ.2 లక్షల చొప్పున నగదు పారితోషికం అందించనున్నారు. అవార్డు గ్రహీతలకు జ్ఞాపిక, సన్మాన పత్రంతో పాటు ఈ నగదు బహుమతులను అందించనున్నారు.
నంది టీవీ అవార్డుల్లో టెలి చిత్రాలు, టీవీ ఫీచర్స్, మెగా సీరియల్స్, డైలీ సీరియల్స్, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక సంబంధిత చిత్రాలు, విద్యా విషయక చిత్రాలు తదితర విభాగాలను చేర్చనున్నారు. టీవీ విభాగంలో మొత్తం 48 అవార్డులను అందించనున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. ప్రథమ, ద్వితీయ ఉత్తమ టెలి ఫిల్మ్, టెలి ఫీచర్స్, మెగా టీవీ సీరియల్, డైలీ టీవీ సీరియల్, టీవీ బాలల చిత్రం వంటి విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు.
అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, సహాయ నటుడు, హాస్య నటుడు, హాస్య నటి, ప్రతినాయకుడు, బాలల నటుడు, బాలల నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత తదితర విభాగాల్లోనూ పురస్కారాలను అందించనున్నారు. నంది టీవీ అవార్డు గ్రహీతలకు కూడా బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికం అందించనున్నారు.
తెలుగు సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించడం నంది అవార్డుల ప్రధాన ఉద్దేశమని ఎఫ్డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబర్ 2026లోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.













