Last Updated:
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు ఆయనతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. తమ షరతులు ఒప్పుకునేదాకా హార్ముజ్ జలసంధి తెరుచుకోదని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం 2029 జనవరి 20న ముగిసే వరకు ఆ దేశంతో ఎలాంటి భవిష్యత్ చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ సోమవారం కుండబద్దలు కొట్టింది. ట్రంప్ తమతో ఎప్పటికీ ఒప్పందానికి రారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ సలహాదారు మజిద్ షాకేరి స్పష్టం చేశారు. ఆయన పదవీకాలం పూర్తయ్యే వరకు ఇరాన్ తన ప్రస్తుత విధానాన్నే కచ్చితంగా అనుసరిస్తుందని తేల్చిచెప్పారు.














