“ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జిఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నౌకలో ఉన్న 11 మంది భారతీయ పౌరులలో ఇప్పటివరకు 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతైనట్లు సమాచారం ఉంది. మా రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది. మాకు సహకరిస్తున్న ఒమన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.”
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు “తీవ్ర ఆందోళనకరం” అని భారత ప్రభుత్వం పేర్కొంది. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకుని, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని అన్వేషించాలని అన్ని పక్షాలను భారత్ కోరింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా ఉచిత, నిరంతరాయ నౌకాయానం, వాణిజ్యం సాగేలా చూడాలని స్పష్టం చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ఈ దాడి జరిగింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ఒక సైప్రస్ దేశపు కంటైనర్ నౌక “అనధికారిక మార్గం” లో ప్రయాణిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దానిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
అనుమతించబడిన మార్గంలో వెళ్లాలని తాము ఇచ్చిన హెచ్చరికలను పలు నౌకలు బేఖాతరు చేశాయని, అందుకే హెచ్చరికగా కాల్పులు జరిపి ఒక నౌకను నిలిపివేసినట్లు ఇరాన్ గార్డ్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ ఎగుమతులకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గంగా ఉంది.
మరోవైపు, అమెరికా ఈ ఘటనను పౌర వాణిజ్య నౌకపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. ఈ దాడి వల్ల సైప్రస్ కంటైనర్ నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతింది మరియు నౌకలో మంటలు చెలరేగడంతో సిబ్బంది ప్రాణరక్షణ కోసం లైఫ్‌బోట్‌లలోకి మారాల్సి వచ్చింది. నౌకలోని ఒక పౌర సిబ్బంది గల్లంతయ్యారు. బ్రిటన్ సముద్ర వాణిజ్య సంస్థ (UKMTO) కూడా ఈ ఘటన ఒమన్ తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో జరిగిందని, సిబ్బంది నౌకను ఖాళీ చేశారని ధృవీకరించింది.
ఈ సముద్ర దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ఇరాన్ లక్ష్యాలపై మరో దఫా సైనిక దాడులు ప్రారంభించింది. ఈ వారంలో ఇది మూడో రౌండ్ దాడి అని, ఇరాన్ సైనిక స్థావరాలపై సుమారు 140 దాడులు చేసినట్లు CENTCOM ప్రకటించింది.
దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల సహాయంతో జోర్డాన్, కువైట్, బహ్రెయిన్ మరియు ఖతార్‌లలోని అమెరికా సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ప్రాంతీయ ఘర్షణ తీవ్రం కావడంతో బహ్రెయిన్, ఖతార్, యూఏఈ (UAE) దేశాలలో సైరన్లు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్, కేశ్మ్ దీవి మరియు ఖుజెస్తాన్ ప్రాంత్లాలలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ప్రస్తుత ఉద్రిక్తతలు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల ప్రయాణానికి భద్రత కరిపించేంత వరకు గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలోపేతం చేసే చర్చలు ముందుకు సాగవని అమెరికా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జలసంధి మూసి ఉంటుందని, తమపై మళ్లీ దాడులు జరిగితే ప్రాంతంలోని శత్రువుల మరిన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.













