Last Updated:
తళపతి విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకన్’ విడుదలపై మరోసారి ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. సెన్సార్ సమస్యలు త్వరలో పరిష్కారమైతే ఈ సినిమా జూలైలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తమిళ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయ నాయకుడు తళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది జూలైలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సినీ పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, గత కొంతకాలంగా ఎదురవుతున్న సెన్సార్ సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని, దీంతో చిత్రబృందం జూలైలో సినిమా విడుదల చేసే అంశంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు చిత్ర నిర్మాణ సంస్థ లేదా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
తెలియని విషయమేమీ కాదు.. విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు నటించిన చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై ప్రారంభం నుంచే భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. మొదట ఈ చిత్రాన్ని 2026 జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అభిమానులు ఆ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.
సమాచారం ప్రకారం, గత ఏడాది డిసెంబర్లో చిత్రాన్ని సెన్సార్ బోర్డుకు సమర్పించగా, సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్‌లోని రూల్ 24 ప్రకారం ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి తుది అనుమతి రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌తో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాజకీయ, సామాజిక అంశాల నేపథ్యంలో రూపొందిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ ఏడాది జనవరిలో సినిమా విడుదల వాయిదా పడినప్పుడు, నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “మా అభిమానులు, భాగస్వాములకు ఈ విషయం తెలియజేయడం బాధాకరం. జనవరి 9న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇది మా నియంత్రణలో లేని పరిస్థితుల కారణంగా తీసుకున్న నిర్ణయం” అని పేర్కొంది.
అంతేకాకుండా, “ఈ సినిమాపై అభిమానులు చూపుతున్న ఆసక్తి, ప్రేమ, భావోద్వేగాలను మేము పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం. ఈ నిర్ణయం మాకు అంత సులభం కాదు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటి వరకు అభిమానులు ఓపికగా ఉండాలని, ఇలాగే మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. మీ ప్రేమ, ఆదరణే ‘జన నాయకన్’ బృందానికి అతిపెద్ద బలం” అని నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జన నాయగన్’ జూలై విడుదలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను కేవలం ప్రచారంగానే చూడాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏదేమైనా, విజయ్ సినీ జీవితానికి ముగింపు పలికే చిత్రంగా భావిస్తున్న ‘జన నాయగన్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై వచ్చే ప్రతి వార్త కూడా ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













