Last Updated:
గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ రోజు ధైర్యం చెప్పే కుటుంబ సభ్యులు లేరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారి తీశాయి.
గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా వేదికలపై ఎంతో ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా కనిపించే తారక్.. తాజాగా జరిగిన ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన గతాన్ని తలచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన సినీ ప్రయాణం మొదలైన తొలినాళ్లలో కుటుంబ సభ్యులెవరూ అండగా లేరంటూ ఆయన పంచుకున్న విషయాలు అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి.
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ.. తన సినీ అరంగేట్రం నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. “2000 సంవత్సరం నవంబర్ నెలలో రామోజీ ఫిల్మ్ సిటీలో నా మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్ జరిగింది. ఆ రోజు నా జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. కానీ, ఆ కార్యక్రమానికి నా తల్లిదండ్రులు ఇద్దరూ రాలేదు. అమ్మ బయటకు రాదు కాబట్టి రాలేదు. ఇక నాన్న (నందమూరి హరికృష్ణ) విషయానికొస్తే.. ‘నీ కాళ్ల మీద నువ్వే నిలబడాలి, నీ కష్టాలు నువ్వే పడాలి, అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది’ అని చెప్పి ఆయన కూడా రాలేదు. ఆ రోజు నా పక్కన నిలబడి, నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పే కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అప్పటికి నా వయసు 17 ఏళ్లు. ఒంటరిగా, ఎంతో భయపడుతూ ఆ వేడుకకు వెళ్లాను. అప్పుడు నా మనసు చాలా బాధపడింది” అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
అయితే “నా ఒంటరితనాన్ని, బాధను ఆ దేవుడు విన్నాడేమో.. అభిమానుల రూపంలో నాకు అతిపెద్ద కుటుంబాన్ని బహుమతిగా ఇచ్చాడు. అంతటితో సరిపోదు అనుకున్నాడేమో రాజమౌళి గారి కుటుంబాన్ని నా సొంత కుటుంబంగా మార్చాడు. జక్కన్న, కీరవాణి గారు, రమా గారు, వల్లి గారు ఇలా ఆ కుటుంబ సభ్యులంతా నన్ను సొంత బిడ్డలా ఆదరించారు. ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా సమయానికి నా వయసు 17 ఏళ్లు కాగా, కార్తికేయ వయసు కేవలం 8 ఏళ్లు. అప్పటినుంచి కార్తికేయ నాకు ఓ తమ్ముడిగా, తోడుగా ఉన్నాడు” అని తారక్ చెప్పుకొచ్చారు. ఇలా ఎన్టీఆర్ ఒక అగ్ర హీరో స్థాయిలో ఉండి కూడా, తన గతాన్ని ఏమాత్రం దాచుకోకుండా అభిమానులతో పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది.














