Last Updated:
కాంగ్రెస్ అధిష్టానం నుంచి కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పిలుపు వచ్చింది. ఉటాహుటిన ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని సిద్దరామయ్య స్వయంగా తెలిపారు. ఈ పిలుపు వెనుక సీఎం మార్పు కారణమా అంటూ కర్ణాటక రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. పూర్తి వివరాలు కథనంలో.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి సీఎం మార్పు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించడమే ఇందుకు ప్రధాన కారణం. 2023లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ఈ ‘సీఎం మార్పు’ ప్రశ్న.. తాజా పరిణామాలతో మళ్లీ తెరపైకి వచ్చింది.
హైకమాండ్ నుంచి తనకు పిలుపు వచ్చిన విషయాన్ని సీఎం సిద్ధరామయ్య స్వయంగా ధృవీకరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తనకు ఫోన్ చేశారని ఆయన చెప్పారు. “నన్ను ఢిల్లీకి రమ్మన్నారు.. కానీ అక్కడ చర్చించబోయే అంశం ఏంటనేది నాకు ఇంకా తెలియదు. మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం షెడ్యూల్ అయింది. ఇలాంటి ఊహాగానాలు, పుకార్లు రాజకీయాల్లో ఎప్పుడూ ఉండేవే” అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలపై కర్ణాటక కాంగ్రెస్‌లో మరో బలమైన నేత, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అంతే ఆచితూచి స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. “సుర్జేవాలా మీకు ఏం చెప్పారో నాకు తెలియదు. అధిష్ఠానం నన్ను కూడా రమ్మంటే దిల్లీకి వెళ్తాను. పార్టీ ఎప్పుడు పిలిచినా వెళ్లడం మా బాధ్యత. అయితే, లీడర్‌షిప్ మార్పు గురించి మాట్లాడటం నా పని కాదు, దానిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను” అని స్పష్టం చేశారు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటి నుంచి.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య “రొటేషనల్ చీఫ్ మినిస్టర్” ఒప్పందం కుదిరిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పార్టీ అధిష్ఠానం ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ, ఇద్దరు నేతలూ సీఎం పదవికి సమానమైన అర్హతలు, బలమైన అనుచరవర్గం కలిగి ఉండటంతో ఈ వివాదం సమసిపోలేదు. సిద్ధరామయ్యకు అపారమైన ప్రజాదరణ, ‘అహిందా’ (వెనుకబడిన వర్గాల) సామాజిక సమీకరణాల మద్దతు, సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్నాయి.
మరోవైపు, డీకే శివకుమార్‌కు అద్భుతమైన పార్టీ నిధుల సమీకరణ శక్తి, సంస్థాగత పట్టు మరియు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడిన ట్రాక్ రికార్డ్ ఉన్నాయి. అప్పట్లో దిల్లీలో జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సిద్ధరామయ్యకు సీఎం పీఠం ఇవ్వగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













