Karnataka Politics: కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews

కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు


Last Updated:

Karnataka Politics: మంత్రి పదవులు ఆశించి భంగపడిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో రెబెల్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. జూన్ నెలలో సిద్ధరామయ్య స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్, 2 నెలల తర్వాత తన కేబినెట్‌ను విస్తరించారు. సోమవారం జరిగిన ఈ మంత్రివర్గ విస్తరణలో, కేబినెట్ గరిష్ట సంఖ్య అయిన 34కి చేరేలా మొత్తం 20 మంది మంత్రులను.. అంటే.. 12 మంది కొత్తవారు, 8 మంది పాతవారిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ తాజా విస్తరణలో మహిళల నుంచి.. ఒక్క గాయత్రి శాంతేగౌడకి మాత్రమే అవకాశం దక్కింది. మంత్రి పదవులు ఆశించి భంగపడిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో రెబెల్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ఎవరైనా రాజీనామా చేస్తానంటే, నేను కేవలం నిమిషాల్లోనే దానిని ఆమోదిస్తాను” అని సీఎం డీకే శివకుమార్ మంగళవారం నాడు మీడియా సమావేశంలో గట్టిగా హెచ్చరించారు. మంత్రి పదవులు దక్కని కారణంతో యశవంతరాయగౌడ వి.పాటిల్, బేలూరు గోపాలకృష్ణ వంటి సీనియర్ ఎమ్మెల్యేలు రాజీనామాకు మొగ్గుచూపినట్లు వస్తున్న వార్తల తరుణంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని ఇండియా టైమ్స్ రిపోర్ట్ చేసింది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదనీ, రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమేనని ఆయన స్పష్టం చేశారు. “రాజీనామాలు చేసే వారిని ఎవరూ ఆపలేరు. కానీ వారికి ఒక పార్టీ కావాలి, ఒక రాజకీయ భవిష్యత్తు కావాలి. పార్టీ ఉంటేనే మిగతావన్నీ ఉంటాయి” అని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఇవి కూడా చదవండి: Mobile Hacks: ఇలా చేస్తే మొబైల్ చోరీ అవ్వదు.. 3 సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

ఈ సందర్భంగా సీఎం డీకే శివకుమార్ తన సొంత రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చూపుతూ ఇతర ఎమ్మెల్యేలను ఓర్పుగా ఉండాలనే సంకేతం ఇచ్చారు. “గతంలో ధరమ్ సింగ్, సిద్ధరామయ్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో నాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అప్పట్లో నేను కూడా కోపంతో రాజీనామా చేసి ఉండొచ్చు, కానీ నేను ఓర్పుతో వేచి చూశాను. అదే విధంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర కూడా అవకాశం కోసం ఎంతో ఓపికతో వ్యవహరించలేదా?” అని శివకుమార్ గుర్తుచేశారు.

అంతేకాకుండా, పార్టీలోని సీనియర్ నేతల చరిత్రను ఆయన ప్రస్తావించారు. “వీరేంద్ర పాటిల్ సీఎంగా ఉన్న హయాంలో ఎస్. బంగారప్ప, మల్లికార్జున ఖర్గే, ధరమ్ సింగ్ వంటి ఉద్దండులకు మంత్రి పదవులు దక్కలేదు. అయినప్పటికీ వారు పార్టీని వీడలేదు, సహనంతో ఉన్నారు. ఆ తర్వాత కాలంలో బంగారప్ప, ధరమ్ సింగ్ లు ముఖ్యమంత్రులు కాలేదా? కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులకు అత్యంత సహనం అవసరం” అని ఆయన హితవు పలికారు.

ఇవి కూడా చదవండి: Weather Update: ఇటు ద్రోణి, అటు ప్రళయ తుపాను.. ఏపీ, తెలంగాణకి 6 రోజులు వర్షాలు!

అసంతృప్తుల నిరసనలు, రాజీనామా బెదిరింపులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, ఇండి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే యశ్వంత రాయగౌడ వి.పాటిల్.. మంత్రి పదవి రాకపోవడంతో సోమవారం డిప్యూటీ స్పీకర్‌ రుద్రప్ప లమానికి తన రాజీనామా సమర్పించారు. గుబ్బి ఎమ్మెల్యే ఎస్.ఆర్. శ్రీనివాస్ సైతం KSRTC చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ, 2028లో స్వతంత్రంగా ప్రజల అభిప్రాయం మేరకు పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, సీనియర్ నాయకులు ఎం.కృష్ణప్ప, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ప్రియా కృష్ణ మద్దతుదారులు.. బెంగుళూరులోని పార్టీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. వారికి KPCC అధ్యక్షుడు బి.కె.హరిప్రసాద్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

మంత్రి పదవులు దక్కని వారికి ఇతర అవకాశాలు కల్పిస్తామని సీఎం శివకుమార్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ల పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో నియమితులైన చైర్మన్ల పదవీకాలం రెండున్నరేళ్లు.. ఇప్పటికే ముగిసిందనీ, వారి స్థానంలో కొత్తవారికి, ముఖ్యంగా అసంతృప్త ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. మొత్తం మీద, డీకే శివకుమార్ హెచ్చరికలు.. అసంతృప్తులను దారిలోకి తెస్తాయా లేక మరింత కలకలానికి దారి తీస్తాయా అనేది రాబోయే రోజుల్లో తెలియవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports