Last Updated:
Ketan Agarwal Murder: ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్ (26) అనే యువకుడు పూణేలోని లోహగఢ్ కోటపై నుండి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడని మొదట అందరూ భావించారు. కానీ, ఆ ప్రమాదం వెనుక ఉంది మరెవరో కాదు.. కొద్ది రోజుల్లో అతడిని పెళ్లాడబోయే కాబోయే భార్య సియా గోయల్ (26) అని తెలిసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.
తన ప్రియుడు చేతన్ చౌదరి (22)తో కలిసి ఆమె వేసిన పక్కా మర్డర్ ప్లాన్‌ను పూణే రూరల్ పోలీసులు ఛేదించారు. ప్రియుడు ధరించిన ఒక ఒక ‘హుడీ’ (Hoodie) జాకెట్ ఈ గుట్టును రట్టు చేసింది.
పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ (SP) సందీప్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ హత్యకు సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు. జూన్ 18న జరిగిన ఈ ఘటనపై మొదట ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదైంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే కాబోయే భర్త ఫోటోలు తీసుకుంటూ లోయలో పడి చనిపోవడంతో అందరూ సియా గోయల్‌పై తీవ్ర సానుభూతి చూపించారు. అయితే, ప్రమాదం జరిగిన తీరుపై ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో కొన్ని పొంతన లేని విషయాలుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
కోటకు వెళ్లే దారుల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో కేతన్, సియా ప్రయాణిస్తున్న వాహనం వెనుకాలే ఒక యువకుడు నిరంతరం ఫాలో అవ్వడం పోలీసుల కంటపడింది. తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, ఆ యువకుడు శరీరం మొత్తం కప్పేసేలా ‘హుడీ’ జాకెట్ ధరించి ఉండటం దర్యాప్తు అధికారులకు తీవ్ర అనుమానాన్ని కలిగించింది.
కోట పరిసరాల్లోని సీసీటీవీలను మరింత లోతుగా పరిశీలించగా, ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలో కూడా అదే హుడీ ధరించిన వ్యక్తి తిరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆ వ్యక్తిని చేతన్ చౌదరిగా గుర్తించిన పోలీసులు, అతడికి సియా గోయల్‌తో ఉన్న సంబంధాన్ని కనిపెట్టారు. ఆపై సియాను తమదైన శైలిలో విచారించగా, ప్రియుడితో కలిసి తానే ఈ హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కేతన్ అగర్వాల్, సియా గోయల్‌ల వివాహం ఇరు కుటుంబాల పెద్దలు కుదిర్చారు. మొదట ఇద్దరూ ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. జైపూర్‌లో గ్రాండ్‌గా వెన్యూ బుక్ చేసి, బంధువుల కోసం ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసేంత రేంజ్లో పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, సియాకు అప్పటికే చేతన్ చౌదరితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. తన ప్రేమకు అడ్డుగా ఉన్న కేతన్‌ను శాశ్వతంగా వదిలించుకోవాలని ఆమె డిసైడ్ అయ్యింది.
ఈ క్రూరమైన ప్లాన్ అమలు చేయడానికి వారు లోహగఢ్ కోటను ఎంచుకున్నారు.
మే 31 (మొదటి విజిట్): కేతన్‌తో కలిసి సియా మొదటిసారి లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్ళింది. అక్కడే అతడిని తోసేసి ప్రమాదంగా చిత్రీకరించవచ్చనే ప్లాన్ ఆమె మైండ్లోకి వచ్చింది.
జూన్ 14 (రెండో విజిట్): ఈసారి ప్రియుడు చేతన్ చౌదరిని కూడా వెంటబెట్టుకుని కోటకు వెళ్లారు. కానీ ఆ రోజు కేతన్‌ను చంపేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.
జూన్ 18 (మూడో విజిట్): చివరకు జూన్ 18న పక్కా ప్లాన్‌తో కేతన్‌ను కోట పైనుంచి లోయలోకి నెట్టేసి హత్య చేశారు. ప్రస్తుతం నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













