Last Updated:
IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరుగుతున్న హైవోల్టేజ్ పోరులో ముంబై ఇండియన్స్(MI) బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 147 పరుగుల మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు కేకేఆర్ బౌలర్లు చుక్కలు చూపించారు. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి, వరుసగా భారీ స్కోర్లతో ఊపుమీదున్న ముంబై బ్యాటర్లు.. కోల్‌కతా దెబ్బకు ఈడెన్ గార్డెన్స్‌లో చేతులెత్తేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చినా ముంబై రాత మారలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఎంఐ.. కేవలం 147 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో కార్బిన్ బాష్ సిక్సర్లతో చెలరేగకపోతే ముంబై పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది!
ఈ చావో రేవో పోరులో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే సంకోచం లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్‌ను వాడుకుంటూ కేకేఆర్ బౌలర్లు మొదటి ఓవర్ నుంచే లైనప్ మార్చేశారు. ముంబైకి ప్రతి మ్యాచ్‌లో మెరుపు ఆరంభాలు ఇచ్చే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(6) ఈసారి పూర్తిగా తేలిపోయాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఒకే ఓవర్‌లో రికెల్టన్, ఆ వెంటనే నమన్ ధీర్(0) పెవిలియన్ చేరడంతో ముంబై ఆత్మరక్షణలో పడింది. ఆ కాసేపటికే సౌరభ్ దూబే ఊపు అందుకున్నాడు. నాలుగో ఓవర్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(15)తో పాటు డేంజరస్ సూర్యకుమార్ యాదవ్(15)లను బలితీసుకున్నాడు. దాంతో 5.3 ఓవర్లలోనే 41 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి ముంబై కుప్పకూలింది. మధ్యలో వర్షం వచ్చి మ్యాచ్ కాసేపు ఆగినా.. ముంబై బ్యాటర్ల ఆటతీరులో మాత్రం మార్పు రాలేదు.
గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై మ్యాచ్ తర్వాత మూడు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. తిలక్ వర్మతో కలిసి హార్దిక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 49 బంతుల్లో 43 పరుగులు జోడించినప్పటికీ రన్ రేట్ మాత్రం పెరగలేదు. 32 బంతులు ఆడిన తిలక్ వర్మ కేవలం ఒక్క సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్ వెళ్లిన కొద్దిసేపటికే.. క్రీజులో సెట్ అయిన హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్స్)ను మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తన అద్భుతమైన గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 15.2 ఓవర్లలో 95 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ముంబై 100 మార్కు దాటడం కూడా కష్టంగా మారింది.
ఆ తరుణంలో వచ్చిన విల్ జాక్స్ 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 14 పరుగులు చేసి జోరు మీదున్నట్లు కనిపించినా.. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నాడు. అయితే ఆఖరి రెండు ఓవర్లలో సీన్ మారింది. కార్బిన్ బాష్ మైదానంలో సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు దంచి కొట్టాడు. అతనికి తోడుగా దీపక్ చాహర్ కూడా 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేయడంతో ముంబై స్కోరు బోర్డు 140 దాటి.. ఆఖరికి 147/8 వద్ద ఆగింది. ఈ ఇద్దరి మెరుపులే ముంబై పరువును కాపాడాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగీ ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ ముగ్గురూ తలో 2 వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించగా, సునీల్ నరైన్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ 148 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయాల్సిందే. ముంబై బౌలర్లు ఈ స్వల్ప స్కోరును కాపాడుకుని కేకేఆర్‌కు షాక్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 20, 2026 10:20 PM IST













