KVP vs Pawan Kalyan: ‘లై డిటెక్టర్’ పరీక్షకు సిద్ధమా? పవన్ కళ్యాణ్‌కు కేవీపీ బహిరంగ సవాల్! | తెలంగాణ వార్తలు | ACTPnews

దివంగత సీఎం వైఎస్సార్‌తో కేవీపీ, పవన్ కళ్యాణ్


Last Updated:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసినవి పూర్తిగా “సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలు” అని కేవీపీ కొట్టిపారేశారు.

దివంగత సీఎం వైఎస్సార్‌తో కేవీపీ, పవన్ కళ్యాణ్
దివంగత సీఎం వైఎస్సార్‌తో కేవీపీ, పవన్ కళ్యాణ్

KVP vs Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆయన ఒక ఘాటు బహిరంగ లేఖను విడుదల చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసినవి పూర్తిగా “సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలు” అని కేవీపీ కొట్టిపారేశారు.

రూ. 10 కోట్ల ఛాలెంజ్.. మీకూ ఆ ధైర్యం ఉందా?

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కేసులు బనాయించారన్న ఆరోపణలపై కేవీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో పవన్ కల్యాణ్‌పై గానీ, ఆయన కుటుంబ వ్యవహారాలపై గానీ వారిలో వారు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి తప్పుడు రాజకీయ కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు.

పవన్ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి కేవీపీ ఒక సంచలన ప్రతిపాదన చేశారు. “వైఎస్సార్ తనను టార్గెట్ చేయమని చెప్పినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్న ఆ ఉన్నత పోలీస్ అధికారి చేత ‘లై డిటెక్టర్’ (అబద్ధాల గుర్తింపు) పరీక్ష ముందు ఆ మాట నిజమేనని చెప్పిస్తే.. వైఎస్సార్ అభిమానులం, నేను కలిసి రూ. 10 కోట్లను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు లేదా పవన్ చెప్పే ఏదైనా స్వచ్ఛంద సంస్థకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం” అని సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలను పవన్ బలంగా నమ్ముతుంటే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

‘అదొక అందమైన ఊహ మాత్రమే’

2005-2006 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్‌కి ఉన్న ప్రజాదరణ ముందు.. అప్పట్లో అసలు రాజకీయాల్లోకే రాని పవన్ కల్యాణ్ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఆ ప్రభుత్వానికి లేదని కేవీపీ ఎద్దేవా చేశారు. “అప్పట్లో మీ రంగులోకి ప్రత్యర్థులు కనుమరుగైపోతారు అన్నంత ప్రజాభిమానం మీకు ఉన్నట్లు దాఖలాలు లేవు.. మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవడం మీ అందమైన ఊహ మాత్రమే” అని లేఖలో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు ప్రజల్లో ఉన్న రాజకీయ బలం ఏంటో 2019 ఎన్నికల ఫలితాలు (రెండు చోట్లా ఓడిపోవడం), 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిరూపించాయని ప్రజాభిప్రాయాన్ని గుర్తు చేశారు. గతంలో యువరాజ్యం అధ్యక్షుడిగా కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా, అప్పటి ప్రభుత్వం పవన్‌పై ఎలాంటి కేసులు పెట్టకుండా ‘పిల్ల చేష్టలు’గా కొట్టిపారేసిందని గుర్తు చేశారు.

వైఎస్సార్ అభిమానుల మనసులు గాయపరచవద్దు

గతంలో చేగువేరా మార్గాన్ని ఆరాధించి, ప్రస్తుతం సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారిన పవన్ కల్యాణ్.. ఇలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు. వైఎస్సార్ చనిపోయి 17 ఏళ్లు అవుతున్నా లక్షలాది మంది ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని, పవన్ చేసే వ్యాఖ్యలు వారి మనసులను గాయపరుస్తున్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలోనూ వైఎస్సార్ అభిమానులు ఉన్నారని, వారిని దూరం చేసుకోవద్దని సూచించారు. తెలంగాణలో సభకు అనుమతి నిరాకరిస్తే ఇక్కడి ప్రభుత్వంతో తేల్చుకోవాలి గానీ, మధ్యలోకి వైఎస్సార్‌ను, కాంగ్రెస్‌ను లాగి అభాసుపాలు కాకూడదని హితవు పలికారు.

పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన మోదీని ఎదిరించండి

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్‌కు కేవీపీ మరో సూచన చేశారు. “ఏపీకి ప్రత్యేక హామీలను నెరవేర్చకుండా, గత పన్నెండేళ్లుగా ‘పాచిపోయిన లడ్డూలను’ పంచిపెడుతున్న ప్రధాని మోదీని ఎదిరించి, తెలుగు ప్రజల హక్కులను సాధించే యోధుడి కోసం ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు” అని విమర్శించారు. ఆ విభజన హామీల సాధన కోసం కేంద్రంపై యుద్ధం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని, లేదా పవన్ కల్యాణ్ తన కూటమి భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడిని ఒప్పించి కేంద్రంపై పోరాడి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని కేవీపీ హితవు పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports