అక్కినేని నట వారసుడిగా ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్, సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ‘సిసింద్రీ’గా బాలనటుడిగానే ప్రేక్షకుల మనసు దోచుకున్న అఖిల్, ‘మనం’ సినిమాలో క్యామియోతో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య తన పేరుతోనే ‘అఖిల్’ అనే చిత్రాన్ని చేసి హీరోగా పరిచయం అయ్యాడు. యాక్షన్, కమర్షియల్ హంగులతో వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త ఊరటనిచ్చినా, ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో, తన కెరీర్‌ను మలుపు తిప్పే ఒక సాలిడ్ హిట్ కోసం అఖిల్ ఇప్పుడు ‘లెనిన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.













