Last Updated:
కేరీర్ లో సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చిత్ర ప్రమోషన్స్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..
అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని హీరోగా, మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (జూలై 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచి అఖిల్ రగ్గడ్ లుక్, టీజర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అఖిల్ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేర మెప్పించిందో పరిశీలిద్దాం.
కథ ఏంటంటే.. రాయలసీమలోని రామాపురం అనే ప్రశాంతమైన గ్రామం. పగలు, ప్రతీకారాలు ఎరగని ఆ ఊరిలోకి పదేళ్ల అనాథ పిల్లాడు ‘లెనిన్’ అడుగుపెడతాడు. ఆ ఊరి పెద్దావిడ (ఈశ్వరీరావు) అతడిని అక్కున చేర్చుకుంటుంది. ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో లెనిన్‌కు ప్రాణస్నేహం ఏర్పడుతుంది. అయితే, ఊహించని పరిణామాల మధ్య జైలుకు వెళ్లిన లెనిన్, కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాక తన ప్రాణ స్నేహితుడు వసంత్‌తో సహా ఊరిలోని వంద మందిని దారుణంగా నరికి చంపుతాడు. అసలు రక్తం రుచే తెలియని ఆ నేలపై లెనిన్ ఎందుకు రక్తపాతం సృష్టించాడు? స్నేహానికి ప్రాణమిచ్చే వాడు నమ్మకద్రోహానికి ఎలా బలయ్యాడు? అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.
పరువు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం అనే బలమైన అంశాల చుట్టూ దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి ఈ కథను అల్లుకున్నారు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్ లో ఈర్ష్య, ద్వేషం పవిత్రమైన స్నేహాన్ని ఎలా నాశనం చేస్తాయో దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాలో బోరింగ్ సీన్స్ లేవని చెప్పలేం కానీ, ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు ఒకెత్తు అయితే ‘లెనిన్’ ఒకెత్తు అని చెప్పొచ్చు. అమాయకత్వం, మొండితనం ఉన్న పాత్రలో అఖిల్ జీవించేశాడు. ఇది ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందం, అభినయంతో ఆకట్టుకోగా, మేకవన్నె పులి లాంటి నెగెటివ్ ఛాయలున్న పాత్రలో ప్రమోద్ పంజు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివాజీ, ఈశ్వరీరావు, రాంకీ తమ పరిధి మేర అద్భుతంగా నటించారు.
సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ యాక్షన్ డ్రామాకు ప్రాణం పోసింది. ‘వారెవా.. వారెవా..’ పాట వినసొంపుగా ఉంది. 90ల నాటి వాతావరణాన్ని ఆర్ట్ విభాగం అద్భుతంగా రీక్రియేట్ చేసింది. కెమెరా వర్క్ అత్యుత్తమంగా ఉంది. ప్రథమార్థం కాస్త స్లో అవ్వడం, సెకండాఫ్‌లో రక్తపాతం (హింస) మోతాదు మరీ ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలహీనతలు. అయినప్పటికీ, ఆద్యంతం ఊహించని మలుపులతో సాగే సెకండాఫ్ సినిమాను నిలబెట్టింది. మొత్తానికి మాస్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ‘లెనిన్’ ఒక పండుగ లాంటి సినిమా.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 10, 2026 11:34 AM IST














