Last Updated:
LPG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్యాస్ కనెక్షన్ పొందడం ఇప్పుడు నగరవాసులకు పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు లభించక, మరోవైపు రెండో సిలిండర్ (DBC) పొందే అవకాశం లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో కొత్త కనెక్షన్లు ఇస్తామంటూ పోటీ పడిన గ్యాస్ ఏజెన్సీలు, ప్రస్తుతం దరఖాస్తుదారులకు చేతులెత్తేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం.. గత మూడు నెలలుగా నగరంలో కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీ దాదాపు నిలిచిపోయింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొత్త డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లకు అనుమతులు ఇవ్వడం లేదని ఏజెన్సీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. గ్యాస్ నిల్వల కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త అనుమతులు మంజూరు కాకపోవడం గమనార్హం.
ఈ నిర్ణయంతో కొత్తగా పెళ్లయిన జంటలు, వేర్వేరుగా కాపురాలు పెట్టిన కుటుంబాలు, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం నగరానికి వచ్చిన వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాలైన కొండాపూర్, కేపీహెచ్బీ, ఉప్పల్ తదితర పరిసర ప్రాంతాలలో కొత్త కనెక్షన్ల కోసం డిమాండ్ భారీగా ఉంది. గ్యాస్ సౌకర్యం లేకపోవడంతో గత్యంతరం లేక ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లపై ఆధారపడాల్సి వస్తోందని, దీనివల్ల కరెంట్ బిల్లుల భారం విపరీతంగా పెరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే సిలిండర్ ఉన్న వినియోగదారులు అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ‘డబుల్ సిలిండర్ కనెక్షన్’ (DBC) కోసం దరఖాస్తు చేసుకుంటున్నా ఏజెన్సీలు తిరస్కరిస్తున్నాయి. కంపెనీల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవనే నెపంతో డీలర్లు దరఖాస్తులను పెండింగ్లో పెడుతున్నారు.
ఒక వేళ ఉన్న ఒక్క సిలిండర్ అయిపోతే, కొత్త రీఫిల్ వచ్చే వరకు వారం నుంచి పది రోజులు నిరీక్షించాల్సి వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 13.5 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు, 265 ఏజెన్సీలు ఉండగా, ఈ అస్పష్టత ఎప్పటికి తొలగుతుందో తెలియక వినియోగదారులు గందరగోళంలో పడ్డారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.
Hyderabad,Telangana














