Malviya Nagar Fire: మంటలు కాదు.. ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అదే.. ఢిల్లీ అగ్నిప్రమాదం ఘటనలో షాకింగ్ నిజాలు | | ACTPnews

ఢిల్లీ అగ్నిప్రమాదం


Last Updated:

గురువారం ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 21 మంది మృతి చెందారు. అయితే ఈ మృతుల్లో ఎక్కువ మంది మంటల వల్ల చనిపోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

ఢిల్లీ అగ్నిప్రమాదం
ఢిల్లీ అగ్నిప్రమాదం

Malviya Nagar Fire: ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఒక హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో రెండు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మెజారిటీ బాధితులు మంటల్లో కాలి కాకుండా, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మరణించారని దర్యాప్తు వర్గాలు వెల్లడించారు. అలాగే, ప్రమాదం జరిగిన సమయంలో పైకప్పుపైకి వెళ్లే మార్గం మూసివేసి ఉందని దానికి ఉన్న గేటుకు తాళం వేసి ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. విదేశీయులు, గురుగ్రామ్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులతో సహా మొత్తం 21 మంది ప్రాణాలను బలిగొన్న ఈ అగ్నిప్రమాదంపై ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. భవనం అంతర్గత నిర్మాణం, భద్రతా ఏర్పాట్లలో లోపాలే ఈ స్థాయిలో ప్రాణనష్టానికి కారణమయ్యాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

పొగ వల్లే ఎక్కువ మంది మృతి

ప్రాథమిక విచారణ ప్రకారం.. మృతుల్లో ఎక్కువ మంది శరీరాలు కాలడం వల్ల కాకుండా, భవనమంతటా వేగంగా వ్యాపించిన దట్టమైన పొగను పీల్చడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆధారాలు చెప్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే పొగ వివిధ అంతస్తులకు ఎలా వ్యాపించింది? లోపల ఉన్నవారికి బయటపడేందుకు తగిన సమయం దొరికిందా? లేదా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు.

మరణించిన వారిలో హోటల్ మూడో అంతస్తులో ఉన్నవారితో పాటు బేస్‌మెంట్‌లో ఉన్నవారు కూడా ఉన్నారు. లోపల చిక్కుకుపోయిన వారు బయటకు వచ్చే మార్గాల కోసం లేదా సురక్షిత ప్రాంతాల కోసం వెతుకుతుండగానే పొగ ముంచెత్తి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, గురుగ్రామ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన మృతదేహాలు నాల్గవ అంతస్తుకు వెళ్లే మెట్ల దారిలో లభ్యమ్యాయి. దీన్ని బట్టి చూస్తే, ప్రాణాలు కాపాడుకోవడానికి వారు పై అంతస్తులకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.

టెర్రస్ గేటుకు తాళం.. ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం?

ఈ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం టెర్రస్ గేటు లాక్ చేసి ఉండటం. ప్రమాద సమయంలో పైకప్పుకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయి ఉందని దర్యాప్తులో తేలింది. ఒకవేళ టెర్రస్ గేటు తెరిచి ఉంటే, దట్టమైన పొగ నుండి తప్పించుకోవడానికి హోటల్ సిబ్బంది, అతిథులు అక్కడికి చేరుకుని ప్రాణాలు దక్కించుకునేవారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అసలు అత్యవసర సమయంలో ఆ గేటుకు తాళం ఎందుకు వేశారు? దానికి బాధ్యులు ఎవరు? భద్రతా నిబంధనలను ఎలా ఉల్లంఘించారు? అనే కోణంలో ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. టెర్రస్ మార్గం మూసివేయడం వల్లే బాధితులు సురక్షితంగా బయటపడలేకపోయారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

కొనసాగుతున్న ఫోరెన్సిక్ తనిఖీలు

ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను, ఆ రాత్రి ఏం జరిగిందనే విషయాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. గత పర్యటనలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందం కేవలం ఒక అంతస్తును మాత్రమే పరిశీలించగలిగింది. మిగిలిన ప్రాంతాలను తనిఖీ చేయడానికి ఈ బృందం మళ్లీ హోటల్‌ను సందర్శించనుంది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) కూడా రంగంలోకి దిగి సమగ్ర పరిశీలన జరపనుంది.

ఢిల్లీ పోలీసులు ఇప్పటికే పలు బృందాలను రంగంలోకి దించి, హోటల్ నిర్వహణలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీస్తున్నారు. భవన మౌలిక సదుపాయాలు, అగ్నిమాపక భద్రతా చర్యలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించడంతో పాటు, హోటల్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల, సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports