ఇవాళ కార్గిల్ విజయ్ దివస్ కావడంతో.. ప్రధాని మోదీ.. దీని గురించే చెబుతూ.. మన్ కీ బాత్ ప్రారంభించారు. అప్పటి సైనికులు ఎలా ఈ యుద్ధాన్ని గెలిచారో, ఎలా ప్రాణ త్యాగాలు చేశారో గుర్తు చేసుకుంటూ.. వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెమోరియల్ నుంచి ద్రాస్ సెక్టార్ వరకూ సాగిన మోటర్ సైకిల్ యాత్రను మోదీ గుర్తుచేసుకున్నారు.
ఇటీవల భారత నౌకా దళంలో మహేంద్రగిరి యుద్ధ నౌక చేరడాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ నౌకలో 75 శాతం భాగాలను ఇండియాలోనే తయారుచేశారని తెలిపారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కి నిదర్శనం అన్నారు. అలాగే.. DRDO.. పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్‌ని విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అలాగే DRDO విజయవంతంగా పరీక్షించిన కుషా మిస్సైల్ గురించి కూడా మోదీ ప్రస్తావించారు.
మోదీ తాను చేసిన.. ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల గురించి మాట్లాడారు. అలాగే గత నెల ఎపిసోడ్లో “క్యాచ్ ది రెయిన్” క్యాంపెయిన్ గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ.. ప్రజలు దేశవ్యాప్తంగా వర్షపు నీటిని ఒడిసి పడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా జులై 4న దేశవ్యాప్తంగా ఒక పెద్ద కార్యక్రమం కూడా జరిగిందని మోదీ తెలిపారు. ప్రజలు చెరువులు, కుంటలను క్లీన్ చేసి.. నీటిని పొదుపు చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్.. విజయనగరంలో కూడా ఈ కార్యక్రమం బాగా జరిగిందని మోదీ తెలిపారు.
క్రీడలపై మోదీ మాట :
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బ్యాడ్మింటన్‌లో ఇటీవల జపాన్‌లో పీవీ సింధు సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తుతించారు. భారతీయ మహిళా క్రికెట్ టీమ్.. లండన్‌లో లార్డ్ స్టేడియంలో టెస్ట్ గెలవడాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఇదో చరిత్రాత్మక గెలుపు అన్నారు.
స్పేస్ రంగంపై:
అంతరిక్షంలో భారత విజయాల్ని ప్రస్తుతించిన ప్రధాని.. ప్రైవేట్ కంపెనీ స్కైరూట్‌కి చెందిన రాకెట్‌ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రంగంలో యువత దూసుకొస్తున్నారని తెలిపారు. సైన్స్ ఒలింపియాడ్‌లో కూడా భారతీయులు పాల్గొని, అందరూ గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలవడాన్ని మోదీ గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్‌లో విదుర్ హెర్బల్ టీ గురించి మోదీ మాట్లాడారు. అక్కడీ లఖీవాలా గ్రామంలో డ్వాక్రా మహిళలు.. స్వదేశీ హెర్బల్ టీ తయారుచేస్తున్నారు. వారు తులసి, లెమన్ గ్రాస్, పసుపు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు వాడి.. ఈ టీని తాయారుచేస్తున్నారు. ఇప్పుడు ఈ టీపొడి చాలా తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా సేల్ అవుతోంది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్లో ఈ టీ పొడిని ప్రజలు బాగా కొన్నారు. ఈ టీపొడి ఆన్లైన్లో కూడా లభిస్తోంది. 100 గ్రాములు రూ.350 పలుకుతోంది. లక్ష రూపాయలతో ఈ కంపెనీ మొదలైంది.. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీగా మారుతోంది.
అమ్మ పేరుతో మొక్క:
దేశంలో అమ్మపేరుతో మొక్క కార్యక్రమం బాగా జరుగుతోందని మోదీ తెలిపారు. అహ్మదాబాద్‌లో ఒక గంటలో 3,50,000లకు పైగా మొక్కలు నాటారని మోదీ తెలిపారు. ఇది గిన్నీస్ బుక్ రికార్డుల్లో కూడా చేరిందని వివరించారు. యూపీలో కూడా.. ఒక రోజులో జులై 12న 35 కోట్ల మొక్కలు నాటారని మోదీ తెలిపారు.
వేస్ట్ ప్లాస్టిక్‌కి చెక్:
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని వేస్ట్ చెయ్యకూడదన్న మోదీ.. బీహార్‌లో వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం గురించి చెప్పారు. అక్కడ వేస్ట్ ప్లాస్టిక్‌ని ఉపయోగించి, ఎలా బెంచీలు తయారుచేస్తున్నారో తెలిపారు. ఒక బెంచ్ తయారీకి 40 కేజీల వేస్ట్ ప్లాస్టిక్ ఉపయోగపడుతోందని చెప్పారు.
ఈసారి కూడా మట్టితో తయారుచేసిన గణపతి విగ్రహాల్ని ఉపయోగించాలనీ, స్థానికంగా తయారుచేసిన విగ్రహాల్నే వాడాలని మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ సాధించాలన్నారు. అలాగే దేశ ప్రజలు చేతి వృత్తులకు సంబంధించిన ఏవో ఒక కళాఖండాలు, ఖాదీ, చేనేత వస్త్రాలను కొనాలని మోదీ పిలుపునిచ్చారు.
ఆగస్టు 15:
ఆగస్టులో 15న వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం గురించి ప్రస్తావించిన మోదీ.. కొన్నేళ్లుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం బాగా జరుగుతోందని మోదీ తెలిపారు. ఈసారి కూడా ఇళ్లపై జాతీయ జెండాను ఎగరేసి.. ఆ ఫొటోలను మై గవ్ వెబ్సైట్లో అప్లోడ్ చెయ్యాలని మోదీ సూచించారు.













