మాకు ఏ పార్టీతో సంబంధం లేదు: మెడికవర్ హాస్పిటల్స్‌ వివరణ | Medicover Says Political Leaders’ Presence at Inaugurations Does Not Indicate Party Ties | తెలంగాణ వార్తలు | ACTPnews

మాకు ఏ పార్టీతో సంబంధం లేదు: మెడికవర్ హాస్పిటల్స్‌ వివరణ


Last Updated:

మెడికవర్ హాస్పిటల్స్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ ప్రత్యేక సంబంధం లేదని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని మెడికవర్ ఇండియా సీవోవో మహేష్ డెగ్లోర్కర్ స్పష్టం చేశారు.

మాకు ఏ పార్టీతో సంబంధం లేదు: మెడికవర్ హాస్పిటల్స్‌ వివరణ
మాకు ఏ పార్టీతో సంబంధం లేదు: మెడికవర్ హాస్పిటల్స్‌ వివరణ

మెడికవర్ హాస్పిటల్స్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ ప్రత్యేక సంబంధం లేదని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ మహేష్ డెగ్లోర్కర్ శుక్రవారం స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆసుపత్రికి రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కూడా మా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగిందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా, సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు.

బేగంపేట ప్రాంతంలోని మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అప్పటి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారని, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన వివరించారు. తెలంగాణలో వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆసుపత్రుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న విషయాలు మెడికవర్‌కు ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ ప్రత్యేక అనుబంధం లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ మెడికవర్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారని మహేష్ డెగ్లోర్కర్ తెలిపారు. మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నాయకులు ఆసుపత్రుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు తమ హోదాల్లో ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు హాజరుకావడాన్ని రాజకీయ అనుబంధంగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి తీవ్రమైన, సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులు మెరుగైన చికిత్సపై ఆశతో ఆసుపత్రికి వస్తున్నారని పేర్కొన్నారు. ఇంతమంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సంస్థపై వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా ప్రతికూల ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. “మా దృష్టి రాజకీయాలపై కాదు.. రోగులకు మెరుగైన వైద్యం అందించడంపైనే” అని మహేష్ డెగ్లోర్కర్ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులు, వ్యాధి తీవ్రత, చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించకుండా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారమవుతున్న కథనాలు ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే అవకాశం ఉందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports