Last Updated:
హైదరాబాద్‌లో ఉంటున్న వారికి అలర్ట్. నేడు ఆ రోడ్లన్నీ బంద్, మొహర్రం పండుగ వేళ ట్రాఫిక్ మళ్లింపు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్ పాతబస్తీ వాసులకు, ఆ మార్గాల్లో ప్రయాణించే వారికి ముఖ్య గమనిక. జూన్ 26వ తేదీ శుక్రవారం నగరంలో జరగనున్న బీబీ-కా-ఆలం ఊరేగింపు నేపథ్యంలో పోలీసులు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాతబస్తీలోని పలు ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు. ప్రయాణికులు అనవసరమైన ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నగర పోలీసులు ఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం బీబీ-కా-అలావా వైపు వాహనాలకు అనుమతి లేదు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను సునార్‌గల్లి టీ జంక్షన్ వద్ద దబీర్‌పురా దర్వాజా, గంగానగర్ నాలా, యాకుత్‌పురా వైపు మళ్లిస్తారు. షేక్ ఫైజ్ కమాన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జబ్బార్ హోటల్ వద్ద ఆపి దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ వైపు పంపుతారు. ఎతేబార్ చౌక్ నుంచి బడా బజార్ వైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ఇక్కడికి వచ్చే వాహనాలను పరిస్థితిని బట్టి కోట్లా అలిజా లేదా పురానీ హవేలీ వైపు మళ్లించేలా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఊరేగింపు యాకుత్‌పురా గంగానగర్ నాలాకు చేరుకున్నప్పుడు పురానీ హవేలీ నుంచి ఎతేబార్ చౌక్‌కు వెళ్లే వాహనాలను ఛత్తా బజార్, దబీర్‌పురా, ఎస్‌జే రోటరీ వైపు మళ్లిస్తారు. మొఘల్‌పురా, వోల్టా హోటల్ నుంచి వచ్చే వాహనాలను బీబీ బజార్ ఎక్స్ రోడ్స్ వద్ద ప్యారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్టా వైపు తిప్పుతారు. ఊరేగింపు ఎతేబార్ చౌక్ వద్దకు రాగానే మిట్టీ-కా-షేర్, మదీనా నుంచి వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు. అలాగే కోట్లా అలిజాకు చేరుకున్న సమయంలో మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ నుంచి చౌక్ మైదాన్ ఖాన్ వైపు వచ్చే వాహనాలను హఫీజ్ డంకా మసీదు వద్ద దారి మళ్లిస్తారు.
ఈ భారీ ఊరేగింపు చార్మినార్ వద్దకు చేరుకోగానే నయాపూల్ నుంచి వచ్చే రాకపోకలను నిలిపివేసి మదీనా ఎక్స్ రోడ్స్ వద్ద సిటీ కాలేజ్ వైపు పంపుతారు. షక్కర్‌కోట్ నుంచి గుల్జార్ హౌస్‌కు వెళ్లే వాహనాలను మిట్టీ-కా-షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ లేదా చేలాపురా వైపు మళ్లిస్తారు. మీరాలం మండి వద్దకు చేరుకోగానే సాలార్‌జంగ్ మ్యూజియం, శివాజీ బ్రిడ్జి మార్గాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆయా వాహనాలను సాలార్‌జంగ్ రోటరీ మీదుగా నయాపూల్ ఇతర మార్గాలకు మళ్లిస్తారు. అలావా సర్తౌక్ సమీపంలో చాదర్‌ఘాట్ వంతెన మీదుగా కోఠి వైపు వాహనాలను తిప్పుతారు. నయాపూల్ వద్ద మదీనా వైపు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
సాధారణ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా పోలీసులు నిబంధనలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బస్సులను రంగ్ మహల్, అఫ్జల్‌గంజ్ వైపు మళ్లించనున్నారు. కాలి కబర్, మీరాలం మండి రోడ్డులో ఆర్టీసీ బస్సులకు ఎలాంటి అనుమతి లేదు. ప్రజలు ఈ ఆంక్షలను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే తక్షణ సహాయం కోసం ప్రజలు నేరుగా 9010203626 హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలి.
Hyderabad,Telangana













