Last Updated:
నందమూరి బాలకృష్ణ- కొరటాల శివ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.
నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కింది. బాలయ్య కెరీర్‌లో 112వ (NBK 112) చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు (జూన్ 25న) నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగాయి. అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ (TTD) వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రాజకీయ, సినీ ప్రముఖుల సందడితో ఈ వేడుక ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్ ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ కొట్టగా, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ చిత్రాన్ని నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఎస్‌ఎల్‌వి (SLV) సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య మాస్ యాక్షన్ ఎలివేషన్స్‌కి, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీకి.. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశం తోడవనుండటంతో ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ ‘సింహా’ చిత్రానికి కొరటాల శివ డైలాగ్ రైటర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ హీరో-దర్శకుడిగా కలవడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణ. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా కొరటాల ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మన రాజధాని అమరావతిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం గర్వకారణమని నిర్మాత చెరుకూరి సుధాకర్ సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













