అంతేకాకుండా భావోద్వేగ కుటుంబ కథలు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీలు, యానిమే అడ్వెంచర్లు, అంతర్జాతీయ సిరీస్‌లు కూడా ఈ వారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి జూలై 7 నుంచి జూలై 13 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ప్రధాన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా కలిసి నటించిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘ఇక్కా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, తన కెరీర్‌లో ఒక్క కేసు కూడా ఓడిపోని ప్రముఖ న్యాయవాది అర్జున్ మెహ్రాగా కనిపిస్తారు. న్యాయం కోసం ఎలాంటి రాజీ పడని ఆయన, ఒకప్పుడు తానే శిక్ష పడేలా చేసిన వ్యక్తి షౌర్యమన్ గౌర్ (అక్షయ్ ఖన్నా) తరఫున కేసు వాదించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ కేసు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ, ఆయన నమ్మకాలను ప్రశ్నించేలా మారుతుంది.
పెద్ది – జూలై 9 (నెట్‌ఫ్లిక్స్):
థియేటర్లలో ఘన విజయం సాధించిన రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, అసాధారణ క్రికెట్ ప్రతిభ కలిగిన ఓ కూలీ జీవితాన్ని చూపిస్తుంది. స్థానిక టోర్నమెంట్ల నుంచి ఎదుగుతూ, తన గ్రామ ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా మారే అతని ప్రయాణాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా భావోద్వేగంగా ఆవిష్కరించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు.
పతి పత్నీ ఔర్ వో దో – జూలై 10 (నెట్‌ఫ్లిక్స్):
ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కుటుంబ వినోద చిత్రం, అపార్థాలు, అనుకోని సంఘటనలు, హాస్యభరిత పరిస్థితులతో ప్రేక్షకులను అలరించనుంది. సాధారణంగా కనిపించే ఓ దంపతుల జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఎలా హాస్యాన్ని పండించాయనేదే కథ.
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ – జూలై 9 (నెట్‌ఫ్లిక్స్):
ప్రసిద్ధ రచయిత్రి లారా ఇంగాల్స్ వైల్డర్ రచనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, 1870ల అమెరికా నేపథ్యంలో సాగుతుంది. చార్ల్స్, కరోలైన్ ఇంగాల్స్ కుటుంబం తమ కుమార్తెలతో కలిసి మంచి భవిష్యత్తు కోసం కాన్సాస్ ప్రాంతానికి వెళ్లిన తర్వాత ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో చూపించారు.
ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ – జూలై 10 (జియోహాట్‌స్టార్):
కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న అపారమైన అభిమానాన్ని ఈ డాక్యుమెంటరీ సిరీస్ చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి స్థానిక క్లబ్‌ల వరకు, ఫుట్‌బాల్ అక్కడి సంస్కృతిలో ఎలా భాగమైందో ఇందులో వివరించారు.
ఐ యామ్ నాట్ అఫ్రెయిడ్ – జూలై 8 (నెట్‌ఫ్లిక్స్):
1986 ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌లో, పది సంవత్సరాల బాలుడు మిగ్వెల్ ఒక అపహరణకు గురైన బాలుడిని కనుగొనడం ద్వారా భయానక నిజాలను తెలుసుకుంటాడు.
సింగీతం – జూలై 9 (నెట్‌ఫ్లిక్స్):
డెబ్యూ నటులు అయాన్, అహిల్యా బమ్రూ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సింగీతం’ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మ్యూజికల్ ఫాంటసీ డ్రామాను ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. పర్యావరణం, గ్రామీణ జానపదం, ప్రేమ, సంగీతం అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.












