Last Updated:
పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఓజీ’కి సీక్వెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు సుజీత్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే దశలో ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ చిత్రం 2025లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ మేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ‘ఓజీ 2’ కథ, స్క్రీన్‌ప్లేపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కథను దాదాపు పూర్తి చేసిన ఆయన త్వరలోనే పవన్ కళ్యాణ్‌కు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
‘దే కాల్ హిమ్ ఓజీ’ విజయోత్సవ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఈ సినిమా తనలో మళ్లీ సినిమాలపై ఆసక్తిని పెంచిందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, మంచి కథలు వస్తే సినిమాలు చేయాలనే ఉత్సాహం తనలో ఇంకా ఉందని వెల్లడించారు.
దర్శకుడు సుజీత్‌తో తన తొలి భేటీని గుర్తు చేసుకుంటూ పవన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. “కథ రాయడం సులభం కానీ దాన్ని తెరపై అద్భుతంగా చూపించడం చాలా కష్టం. మొదట త్రివిక్రమ్ సుజీత్ గురించి చెప్పిన తర్వాతే ఆయనను కలిశాను. అప్పుడు ‘మీరు జపాన్‌కు చెందిన సమురాయ్ తరహా గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు. చేతిలో కత్తి, తుపాకీ ఉంటాయి’ అని చెప్పాడు. మొదట కథ పూర్తిగా అర్థం కాలేదు. కానీ నా కుమారుడు ఆ కథ నోట్స్ చదివి ఎంతో ఉత్సాహపడటం చూసి ఇది ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ అని అర్థమైంది” అని అన్నారు.
అంతేకాకుండా, “ఓజీ విజయంతో నాకు మళ్లీ సినిమాలు చేయాలనే ప్రేరణ వచ్చింది. అందుకే సుజీత్‌తో సీక్వెల్, ప్రీక్వెల్ గురించి చర్చించాను. నాకు సమయం దొరికినప్పుడల్లా ఓజీ ప్రపంచాన్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నాను” అని పవన్ పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ‘ఓజీ’లోని ఓజాస్ గంభీర పాత్రకు సంబంధించిన గతం, భవిష్యత్తు కథలను తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రీక్వెల్‌లో ఓజాస్ గంభీర ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారాడు? అతని జీవితంలో జరిగిన కీలక సంఘటనలు ఏమిటి? అనే అంశాలను చూపించే అవకాశం ఉంది. అలాగే సీక్వెల్‌లో ‘ఓజీ’ కథ ముగిసిన తర్వాత అతని ప్రపంచంలో చోటుచేసుకునే పరిణామాలను చూపించే అవకాశముంది.
ఈ చిత్రంలో ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ అనే మాజీ సమురాయ్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. జపాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓజీ, సత్యనారాయణ అనే వ్యాపారవేత్తకు రక్షకుడిగా మారుతాడు. అనంతరం ముంబై అండర్‌వరల్డ్‌లో అత్యంత భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు.
అయితే అనూహ్యంగా పదేళ్ల పాటు అదృశ్యమైన ఓజీ, 1993లో తిరిగి భారత్‌కు వస్తాడు. ఆ తర్వాత ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ ఓమీ భౌతో జరిగే ప్రతీకార పోరాటం కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పుడు ‘ఓజీ 2’పై వస్తున్న వార్తలతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













