Peddi Review: ఇంతకీ పెద్ది హిట్టా, ఫట్టా..? రాసిపెట్టుకోండి.. పక్కా జరిగేది ఇదే | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన పెద్ది మూవీ నేడు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం..

News18
News18

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లోకం ఎంతగానో ఎదురు చూసిన సినిమాల్లో ఒకటి పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. జోరుగా ప్రమోషన్స్ చేశారు. ఇలా ఇవన్నీ కూడా పెద్ది సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఈ పెద్ది అంచనాలను అందుకున్నాడా? అసలు సినిమా ఎలా ఉంది? కథ, కథనాలు మెప్పించాయా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

విజయనగరం జిల్లాలోని ‘కొండ కింద ఊరు’ ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు లేని ఒక అనాథ గ్రామం. ఆ ఊరి ప్రజలంటే సమాజంలో ఒక చిన్నచూపు. అదే ఊళ్లో పుట్టి పెరిగిన పెద్ది (రామ్ చరణ్) రోజూ విజయనగరం వెళ్లి కూలీ పనులు చేసుకుంటుంటాడు. అయితే, అతనికి క్రికెట్‌లో అసాధారణ నైపుణ్యం ఉంటుంది. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగల అతని ప్రతిభ చూసి విజయనగరం, బొబ్బిలి జట్లు వేలంలో పెద్దిని కొనుగోలు చేయడానికి పోటీ పడుతుంటాయి. అందుకే అతన్ని అందరూ ‘ఆట కూలీ’ అని పిలుస్తారు. అలాంటి క్రికెట్ వీరుడు అనుకోని పరిస్థితుల్లో బ్యాట్ పక్కన పెట్టి కుస్తీ (రెజ్లింగ్) క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది, తన ఊరి గుర్తింపు కోసం ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ చిత్ర కథాంశం.

విశ్లేషణ:

దర్శకుడు బుచ్చిబాబు సానా మితిమీరిన మాస్ ఎలివేషన్ల జోలికి వెళ్లకుండా, కథలోని అంతర్లీన భావోద్వేగాలను నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2016 ఒలింపిక్స్ ముగింపు ఘట్టంతో ప్రారంభమయ్యే ఈ కథ, కోల్‌కతా నుండి విజయనగరం లోయల మీదుగా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఫస్టాఫ్ లో పెద్ది ఆడే సరికొత్త క్రికెట్ షాట్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. హీరోయిన్ ట్రాక్ వల్ల కథ కాస్త పక్కదారి పట్టినట్లు అనిపించినా, అప్పలసూరి (జగపతిబాబు) పాత్ర ప్రవేశంతో కథలో అసలైన సంఘర్షణ మొదలై ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే రేంజ్‌లో పేలుతుంది. విరామానికి ముందు వచ్చే రెండు బలమైన ఘట్టాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.

సెకండాఫ్ లో సినిమా పూర్తిగా కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లోకి మారుతుంది. ఒకే ఆటగాడు రెండు భిన్నమైన క్రీడలను మేళవించి ‘క్రాస్ ఓవర్ అథ్లెట్’గా మైదానంలో చెలరేగిపోయే యాక్షన్ సీన్లు నిజంగా ‘పైసా వసూల్’ సన్నివేశాలే అని చెప్పుకోవాలి. అయితే, క్రికెట్ నుండి రెజ్లింగ్‌లోకి హీరో మారే ప్రక్రియలో వచ్చే సవాళ్లను మరింత లోతుగా చూపిస్తే బాగుండేది, కేవలం ఒక డైలాగ్‌తో ముగించడం కాస్త వెలితిగా అనిపిస్తుంది. అయినప్పటికీ, హార్ట్ టచింగ్ క్లైమాక్స్, ఆస్పత్రి సన్నివేశాలు, బలమైన ఎమోషన్స్ సినిమాలోని చిన్న చిన్న లోపాలను భర్తీ చేస్తాయి. ఫస్టాఫ్ లో కమర్షియల్ హంగులకు ప్రాధాన్యమిచ్చిన దర్శకుడు, సెకండాఫ్‌ను పూర్తి కథా బలంపైనే నడిపించారు.

రామ్ చరణ్ మరోసారి తన నటనతో వన్‌మెన్ షో చేశారు. ‘రంగస్థలం’ చిట్టిబాబు తర్వాత పెద్ది పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కుస్తీ యోధుడిగా కనిపించడానికి ఆయన మార్చుకున్న శారీరక రూపం, యాక్షన్ సీన్స్‌లో ఆయన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో చక్కటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరిసింది, ముఖ్యంగా ‘చికిరి’ సాంగ్‌లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. జగపతిబాబు తన మార్క్ గెటప్‌తో భయపెట్టగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ తన హుందాతనంతో పాత్రకు ప్రాణం పోశారు. రావు రమేష్, దివ్యేందు శర్మ ఉన్నంతలో బాగానే చేశారు.

సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో ఉంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, రత్నవేలు విజువల్స్ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ విభాగాలు కూడా చక్కగా కుదిరాయి. తెలుగు తెరపై అరుదుగా వచ్చే ఈ తరహా స్పోర్ట్స్ డ్రామాను నమ్మి తెరకెక్కించిన బుచ్చిబాబు సానాకు, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్‌కు అభినందనలు తెలపాల్సిందే. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయినా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక మంచి హార్ట్ టచింగ్, స్ఫూర్తిదాయకమైన మూవీ చూడాలనుకునే వారికి ‘పెద్ది’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

రేటింగ్: 3.5

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed