Last Updated:
కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్‌లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇప్పుడు ప్రతికూలతలను దాటి సరికొత్త ఆశలు, అసాధారణ ఆకాంక్షలతో ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు. దేశ పౌరులు తమ కలలను, సంకల్పాలను నిజం చేయడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. కర్ణాటకలో సిద్ధరామయ్య మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేయగా, డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
#WATCH | Surat, Gujarat | Prime Minister Narendra Modi says, “There is immense resentment among the people of Karnataka regarding the Congress government, and that is precisely why the party had to change its Chief Minister there. India has moved far beyond negativity; this is a… pic.twitter.com/2CY17pNy30
— ANI (@ANI) June 5, 2026
గడిచిన 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మధ్య అశాంతిని, అనిశ్చితిని సృష్టిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా పక్కన పెట్టారని, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సైతం ప్రజలు ఆ పార్టీ అవినీతి, దుష్పరిపాలన పట్ల తీవ్ర విసుగు చెందారని మండిపడ్డారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లలో మూడింటిని బీజేపీ కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించిందని మోదీ గుర్తు చేశారు. ఈ ఫలితాలు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సైతం కాంగ్రెస్ తప్పుడు పరిపాలనను పూర్తిగా తిరస్కరించారని నిరూపిస్తున్నాయని ఆయన వివరించారు.
హిమాచల్ ప్రదేశ్ కంటే ముందే హర్యానాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందని, పంజాబ్ ప్రజలు కూడా ఆ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని పంపించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సమాజంలో అశాంతిని సృష్టించి, ఆ గందరగోళం నుండి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసే కాంగ్రెస్ పప్పులు ఇకపై ఉడకవని ఆయన హెచ్చరించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













