Last Updated:
టెలికాం సంస్కరణలతో దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలను విస్తరించామని ప్రధాని మోదీ తెలిపారు. 5జీ విస్తరణ వేగంగా సాగుతోందని, డీప్‌ఫేక్స్ లాంటి సైబర్ సవాళ్లపై ప్రపంచ స్థాయి రక్షణ వ్యవస్థ అవసరమని పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారత టెలికాం, డిజిటల్ రంగాల ప్రగతిని సమగ్రంగా వివరించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ వెనకడుగు వేయకుండా టెలికాం సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు బలంగా తీసుకెళ్లామని చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీ ఆధారంగానే పల్లెల్లో ఉండే ప్రజల ముంగిటకు బ్యాంకింగ్, వైద్యం సహా కీలకమైన ప్రభుత్వ సేవలను చేర్చడం సాధ్యమైందని స్పష్టం చేశారు. విప్లవాత్మక టెలికాం సంస్కరణల ద్వారా దేశంలో పారదర్శక పాలనను మరింత బలోపేతం చేశామని, పేదలకు అందాల్సిన సుమారు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా కాపాడగలిగామని తెలిపారు. వ్యవస్థల్లో తీసుకొచ్చిన ఈ మార్పులను ఎవరు వ్యతిరేకించినా సంస్కరణల ప్రయాణం ఆగబోదని స్పష్టం చేశారు.
దేశంలో టెలికాం మౌలిక వసతులు ఊహించని రీతిలో విస్తరించాయని మోదీ వెల్లడించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5జీ నెట్వర్క్ చేరుకుందని, ప్రస్తుతం 5.5 లక్షలకు పైగా 5జీ బేస్ స్టేషన్లు నిరంతరం సేవలందిస్తున్నాయని తెలిపారు. 2022 నాటి పరిస్థితులతో పోలిస్తే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వేగం ఏకంగా పది రెట్లు పెరగడం గర్వకారణమని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఇన్వెస్ట్’, ‘ఇన్నోవేట్’ నినాదాలతో మొబైల్స్, టెలికాం పరికరాల తయారీలో భారత్ ప్రపంచ కేంద్రంగా అవతరిస్తోందని కొనియాడారు.
డిజిటల్ సేవలు పెరుగుతున్న కొద్దీ ఫోన్ సెక్యూరిటీ, నెట్వర్క్ భద్రతను పటిష్టం చేయడం అత్యవసరమని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం డీప్‌ఫేక్స్, సైబర్ మోసాలు సమాజానికి అతిపెద్ద సవాలుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, టెక్ సంస్థలు, ఆర్థిక రంగాలు కలిసి డీప్‌ఫేక్స్‌ను అడ్డుకునేందుకు ఒక గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల వద్దకు మోసపూరిత సమాచారం చేరకముందే సాంకేతిక సాయంతో అడ్డుకునేందుకు అంతర్జాతీయ టెలికాం ఆపరేటర్లు, జీఎస్ఎంఏ సమష్టిగా పనిచేయాలని సూచించారు.
#WATCH | Delhi | At the 10th edition of India Mobile Congress, PM Modi says, “Today, when telecom and digital technology hold such importance, it is essential to make the security framework associated with it airtight and foolproof. Phone security and network security are priorities for all of us. Deepfakes have become such a big challenge. That’s why it is essential that we work on a Global Framework for it. Governments, technology companies, telecom operators, and financial institutions must all align with this framework. I also urge the GSMA and telecom operators worldwide: let us create a global mechanism capable of stopping such fraud before it ever reaches the public. India has learned a great deal from its own experiences in this regard.”
— ANI (@ANI) October 8, 2026
ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సమయంలో ఐఎంసీ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమని మోదీ చెప్పారు. ఈ ఏడాది జీఎస్ఎంఏ బోర్డు సమావేశానికి భారత్ వేదికగా నిలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన టెలికాం నిపుణులకు స్వాగతం పలికారు.














