Last Updated:
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తనపై వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తనపై వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా కొందరు ఆన్‌లైన్ రిపోర్టర్లు, కొన్ని ప్రధాన మీడియా సంస్థలు వార్తలను సంచలనాత్మకంగా ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసి తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను ప్రచారం చేసే ధోరణి ఇటీవల ఎక్కువైందని రకుల్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయాల్లో పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఊహాగానాలతో కథనాలు ప్రచురించడం వల్ల వారి ప్రతిష్ఠ, వృత్తి జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును ఆ వ్యవహారంతో ముడిపెట్టి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు.
తాను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చానని, సినీ పరిశ్రమలో తనకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరని రకుల్ తెలిపారు. తన సొంత కష్టంతోనే సినీ రంగంలో ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. 20 ఏళ్ల వయసు నుంచే బాధ్యత కలిగిన పౌరురాలిగా వ్యవహరిస్తూ, తన ఆదాయానికి సంబంధించిన పన్నులను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నానని ఆమె వెల్లడించారు. చట్టపరమైన, ఆర్థిక బాధ్యతలను ఎప్పటికప్పుడు పాటిస్తూ బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారుగా ఉన్నానని స్పష్టం చేశారు.
అంతేకాకుండా తన వ్యక్తిగత హోదాలో గానీ, ఏదైనా నిర్మాణ సంస్థ తరఫున గానీ అక్రమ విదేశీ నగదు బదిలీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని రకుల్ తెలిపారు. దేశంలో కానీ, విదేశాల్లో కానీ ఇతరుల పేర్లతో బినామీ ఆస్తులు తనకు లేవని చెప్పారు. అలాగే ఎవరూ తనకు ఎప్పుడూ విలువైన ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఖరీదైన బహుమతులను స్వీకరించకూడదనేది తన వ్యక్తిగత సూత్రమని ఆమె పేర్కొన్నారు.
తనపై తప్పుడు, హానికరమైన లేదా ఊహాజనిత కథనాలను ప్రచురించిన మీడియా సంస్థలు వాటిని ఉపసంహరించుకుని, వాస్తవాలను స్పష్టం చేయాలని రకుల్ కోరారు. ఒక వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల అతడి లేదా ఆమె ప్రతిష్ఠకు కోలుకోలేని నష్టం జరిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
మీడియా సంస్థలకు వాణిజ్యపరమైన ఒత్తిళ్లు ఉంటాయనే విషయం తనకు అర్థమవుతుందని రకుల్ అన్నారు. అయితే ఆ ఒత్తిళ్లు వార్తల్లోని వాస్తవాలపై ప్రభావం చూపకూడదని సూచించారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠ, వృత్తి జీవితానికి నష్టం కలిగించే అంశాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి తనపై వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని మరోసారి స్పష్టం చేసిన రకుల్.. తాను ఎప్పటికప్పుడు చట్టాలను, పన్ను నిబంధనలను పాటిస్తున్నానని తెలిపారు. తన గురించి ప్రచారం అవుతున్న వార్తలపై ప్రజలు పూర్తి వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలని ఆమె కోరారు. తాజా ప్రకటనతో తనపై వస్తున్న ఆరోపణలకు రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టమైన వివరణ ఇచ్చినట్టయింది.














