Last Updated:
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అత్యంత ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ పాన్-ఇండియా చిత్రం, ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. భోపాల్, బెంగళూరు నగరాల్లో సందడి చేసిన అనంతరం, గురువారం దేశ రాజధాని దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు.
ఈ ప్రెస్మీట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. గతంలో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. “నేను ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ఆయన ‘పెద్ది’ సినిమా కథాంశం గురించి అడిగారు. ఇదొక రకంగా ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) సంకల్పాన్ని ప్రతిబింబించే మన మట్టి కథ అని చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఒక స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథను పంచుకున్నారు” అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ‘మహ్మద్’ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున ఆడి, తన గ్రామానికి ఎలా గుర్తింపు తెచ్చాడో ప్రధాని వివరించారని చరణ్ పేర్కొన్నారు. నేడు ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ పల్లెటూరు నుండి 85 మందికి పైగా అథ్లెట్లు తయారయ్యారని మోదీ చెప్పారన్నారు. ఒకే ఒక్క వ్యక్తి సమాజంలో ఎంతటి విప్లవాత్మక మార్పు తీసుకురాగలడు అనేదానికి ఈ కథ నిదర్శనమని, ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర కూడా సరిగ్గా అలాంటి స్ఫూర్తితోనే, గ్రామీణ యువత ఆకాంక్షల చుట్టూ సాగుతుందని వెల్లడించారు. ఈ సినిమాలో చరణ్ క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి బహుముఖ క్రీడల్లో రాణించే ఒక పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నారు. ఇదే సమయంలో సినిమాలో తన డ్యాన్స్ గురించి విలేకరులు అడగ్గా.. “నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారు, కాబట్టి డ్యాన్స్ ఇరగదీశాను” అంటూ చరణ్ చమత్కరించి నవ్వులు పూయించారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ రామ్ చరణ్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెరపై ఎంతో ఉద్వేగంగా కనిపించే చరణ్, నిజ జీవితంలో చాలా కూల్‌గా మరియు డౌన్-టు-ఎర్త్ ఉంటారని చెప్పారు. సీనియర్ నటుడు బొమన్ ఇరానీతో కలిసి నటించాలనే తన కల ఈ చిత్రంతో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, దర్శకుడు బుచ్చిబాబు సానా రాసుకున్న భావోద్వేగపూరితమైన కథను, ఆయన విజన్‌ను తాను పూర్తిగా నమ్మి ఫాలో అయ్యానని, చిత్ర యూనిట్ అంతా ఆయనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయామని జాన్వీ పేర్కొన్నారు.
ఈ చిత్రానికి ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, జూన్ 4న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













