Ram Mandir donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో 8 మందిపై కేసు నమోదు. సిట్ దర్యాప్తు ముమ్మరం | | ACTPnews

Ram Mandir donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో 8 మందిపై కేసు నమోదు. సిట్ దర్యాప్తు ముమ్మరం |


సిట్ (SIT) నివేదిక, ఎఫ్‌ఐఆర్ నమోదు:

గతంలో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే రామ మందిరంలో సుమారు రూ.7 నుంచి 7.5 కోట్ల విరాళాలు పక్కదారి పట్టాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 14న ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ఉన్నారు. సిట్ తన ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించిన వెంటనే ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం ప్రకారం ఈ కేసు దాఖలు చేశారు. ముఖ్యంగా యజమాని ఆస్తిని దొంగిలించడం (సెక్షన్ 306), వృత్తిపరమైన హోదాను దుర్వినియోగం చేసి నమ్మక ద్రోహం చేయడం (సెక్షన్ 316-5, దీనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు), దొంగిలించిన వస్తువులను దాచిపెట్టడం (సెక్షన్ 317-5) లాంటి కఠినమైన నాన్-బెయిలబుల్ సెక్షన్లను ఇందులో చేర్చారు.

కేసులో ప్రధాన నిందితులు, అరెస్టులు:

ఈ కేసులో రామ మందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు అత్యంత సన్నిహితుడు. అతని డ్రైవర్ అయిన రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉండటం సంచలనం సృష్టించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న, కేసు నమోదు చేసిన 8 మంది నిందితుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

– రామశంకర్ యాదవ్ (టిన్ను యాదవ్) – చంపత్ రాయ్ సన్నిహితుడు / డ్రైవర్

– సుభాష్ శ్రీవాస్తవ్ – రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, విరాళాల కౌంటింగ్ ఇన్‌ఛార్జి

– అవినాష్ శుక్లా – విరాళాల లెక్కింపు సిబ్బంది

– లవ్‌కుష్ మిశ్రా – విరాళాల లెక్కింపు సిబ్బంది

– అనుకల్ప్ మిశ్రా – విరాళాల లెక్కింపు సిబ్బంది

– మనీష్ కుమార్ యాదవ్ – కౌంటింగ్ సిబ్బంది

– కరుణేష్ పాండే – కౌంటింగ్ సిబ్బంది

– రామశంకర్ మిశ్రా – కౌంటింగ్ సిబ్బంది

వీరందరినీ అయోధ్యలోని ఒక రహస్య ప్రదేశంలో సుదీర్ఘంగా విచారిస్తున్నారు.

చోరీ ఎలా జరిగింది? విరాళాల లెక్కింపు ప్రక్రియ:

రామ మందిరానికి రోజూ సుమారు లక్షకు పైగా భక్తులు వస్తుంటారు. ప్రతిరోజూ సగటున రూ.8 నుంచి 13 లక్షల వరకు నగదు రూపంలో విరాళాలు వస్తుంటాయి, కొన్ని ప్రత్యేక రోజుల్లో ఇది రూ.50 నుంచి 60 లక్షల వరకు కూడా ఉంటుంది. లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సుమారు 20 మంది సిబ్బందితో నిర్వహిస్తారు. ఈ లెక్కింపు సమయంలో కొందరు సిబ్బంది నగదు కట్టల మధ్య 100 రూపాయల నోట్లను దొంగిలించి, తర్వాత వాటిని తమలో తాము పంచుకునేవారని.. సీసీటీవీ ఫుటేజీల ద్వారా.. సిట్ ప్రాథమిక విచారణలో తేలింది. విరాళాల పెట్టెలను సీసీటీవీ నిఘాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు తరలించే ప్రక్రియలో ఈ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

రాజకీయ దుమారం, న్యాయపరమైన పోరాటాలు:

విరాళాల దొంగతనం వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (యూబీటీ) నాయకులు ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. “మహ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నట్లు, భక్తుల కానుకలను దోచుకోవడం సిగ్గుచేటు” అని శివసేన తన సామ్నా పత్రికలో విమర్శించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం స్పందిస్తూ, ఆభరణాలు, నగదు మాయం కావడం వెనుక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. న్యాయవాది మోహిత్ అశోక్ జూన్ 12న సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) దాఖలు చేసి, ఈ కేసును దర్యాప్తు చేసే చట్టపరమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వ సిట్‌కు లేదని, కేంద్ర ఏజెన్సీలతో విచారణ జరిపించాలని కోరారు.

ఇవి కూడా చదవండి: Rare Planets: విశ్వంలో అద్భుతం.. పీచు మిఠాయి కంటే తేలికైన ‘సూపర్-పఫ్’ గ్రహాల గుర్తింపు

మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భక్తులు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, సిట్ తుది నివేదిక వచ్చే వరకు 15 రోజులు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా ఈ ఆరోపణలను ఖండించిన ట్రస్ట్ సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్, చంపత్ రాయ్.. పోలీసుల వద్ద ఆధారాలు లభించడంతో ట్రస్ట్ తరపున అధికారిక ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రామ మందిర ట్రస్ట్ “తీర్థ క్షేత్ర భవన్‌”లో చంపత్ రాయ్, గోపాల్ రావు తదితరులు అత్యవసర సమావేశాలు నిర్వహించి చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నారు. అయితే, నిందితుడు టిన్ను యాదవ్ భార్య పూనమ్ యాదవ్ ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తూ, ఇది కేవలం తన భర్తను ఇరికించే కుట్ర మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాత్మక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed