ఈ సినిమా కథ 1968 నుంచి 1991 మధ్య సాగుతుంది. రామప్ప రావు బహదూర్ అలియాస్ సత్యదేవ్ ప్రాణాపాయ స్థితిలో ఉండగా వైద్యులు చికిత్స కోసం వస్తారు. రాజవంశ వారసుడిగా పేరున్న రామప్ప శారీరకంగా బతికే ఉన్నా, తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతుంటాడు. ఆ పరిస్థితికి అసలు కారణం ఏంటో మొదట ప్రేక్షకులకు అర్థం కాదు. కథ ముందుకు సాగేకొద్దీ కుటుంబ రక్తసంబంధాలు, డీఎన్‌ఏ చుట్టూ అసలు సంఘర్షణ తిరుగుతుందని తెలుస్తుంది.
వృద్ధాప్యంలో తీవ్ర శారీరక, మానసిక సమస్యలతో పోరాడుతున్న రామప్ప గతాన్ని గుర్తు చేసుకుంటూ సాగిన ప్రయాణమే సినిమా. రేణుకతో అతని ప్రేమ ఎలా మొదలైంది? ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? కుటుంబం, సమాజం, రక్తసంబంధాలు అతడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే..
సాధారణ కమర్షియల్ సినిమాల్లో కనిపించే భారీ ఫైట్లు, ఊహించని ట్విస్టులు, హీరో ఎలివేషన్లు ఇందులో కనిపించవు. దర్శకుడు వెంకటేష్ మహా పూర్తిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుడు అడుగుపెట్టడానికి కొంత సమయం పడుతుంది. మొదటి అరగంట నెమ్మదిగా సాగుతుంది. రామప్ప జీవితం, భువనాలయం, ప్రత్యేక భాష, మ్యాజికల్ రియలిజం అంశాలు అర్థం కావడానికి కాస్త ఓపిక అవసరం. ఆ తర్వాత కథ గాడిలో పడుతుంది. ఒక్కో సన్నివేశం ఆసక్తి పెంచుతూ ముందుకు తీసుకెళ్తుంది.
ఇలాంటి కథను తెలుగు దర్శకుడు ఎలా ఊహించాడా అని చాలాసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. కథ చెప్పిన తీరు, పాత్రల రూపకల్పన, తాత్విక ఆలోచనలు కొత్త అనుభూతిని ఇస్తాయి. గతంలో ఇలాంటి కథ ఎక్కడైనా వచ్చి ఉంటే అది తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు ఈ సినిమాను ఒరిజినల్ ప్రయత్నంగా అభినందించాల్సిందే.
ఈ సినిమా రాజవంశం గురించే కాదు. తరతరాలుగా కొనసాగుతున్న కులం, వంశం, చర్మరంగు, రక్తసంబంధాలపై సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నిస్తుంది. హాస్యం, వ్యంగ్యం, ప్రతీకలు, తాత్విక సంభాషణలతో బలమైన సందేశాన్ని అందిస్తుంది. 1968 నుంచి 1991 కాలం నేపథ్యంలో కథ సాగుతుంది. సమాజం మనిషి ఆలోచనలపై చూపే ప్రభావాన్ని బాగా చూపించారు. సందేశం చెప్పే క్రమంలో ఎక్కడా బోధిస్తున్న భావన రాదు. హాస్యం కథకు మంచి బలం ఇచ్చింది.
సత్యదేవ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. రామప్ప పాత్రలో గర్వం, బలహీనత, హాస్యం, భావోద్వేగం అన్నింటినీ అద్భుతంగా చూపించాడు. ఈ పాత్రను ఇంత నమ్మకంగా మరో నటుడు చేయగలడా అనే సందేహం కలుగుతుంది.
అచ్చమ్మ పాత్రలో నటించిన నటి సినిమాకు పెద్ద ఆకర్షణ. ఆమె కనిపించే ప్రతి సన్నివేశం నవ్వులు పంచుతుంది. రేణుక పాత్రలో దీపా థామస్ చక్కగా ఒదిగిపోయింది. ఆచారి పాత్రలో వికాస్ ముప్పాల కూడా మెప్పించాడు. కథ ముందుకు వెళ్లేకొద్దీ అతడి పాత్ర ప్రాధాన్యం పెరుగుతుంది.
సంభాషణలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ‘పెద్ద మనిషి’ డైలాగ్ బలమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. భర్తకు రేణుక ఎదురు నిలిచే సన్నివేశం గుర్తుండిపోతుంది. కుసుమరాజు చెప్పే పుట్టినరోజు లెక్కల మాటలు లోతైన అర్థాన్ని చెబుతాయి. సంజయ్ గాంధీ ఎపిసోడ్ చరిత్రను వ్యంగ్యంతో కలిపి చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగా కూడా సినిమా మంచి స్థాయిలో ఉంది. సమర సాయి సంగీతం కథకు తగిన వాతావరణాన్ని సృష్టించింది. ఛాయాగ్రహణం కాలం నేపథ్యాన్ని అందంగా చూపించింది. ఆర్ట్ విభాగం పని కూడా ప్రశంసించాల్సిందే. నిర్మాణ విలువలు ప్రతి సన్నివేశంలో కనిపిస్తాయి. అయితే ఈ సినిమా అందరికీ నచ్చే అవకాశం లేదు. వేగంగా సాగే కమర్షియల్ కథ కోరుకునే ప్రేక్షకులకు ఇది నెమ్మదిగా అనిపించవచ్చు. ఓపికగా చూస్తే మాత్రం మంచి అనుభూతిని అందిస్తుంది.
‘రావు బహదూర్’ కొత్త ఆలోచనతో తెరకెక్కిన ప్రత్యేక చిత్రం. తొలి భాగం కాస్త నెమ్మదిగా సాగినా, రెండో భాగం ఆ లోటును భర్తీ చేస్తుంది. క్లైమాక్స్ బలమైన ముగింపును ఇస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల కంటే భిన్నమైన కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్: 3












