S Janaki: నేలరాలిన సిరిమల్లె పువ్వు.. మూగబోయిన జానకమ్మ గాత్రం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

ఎస్ జానకి


Last Updated:

S Janaki: విలక్షణమైన వాయిస్.. ఇట్టే ఆకట్టుకునే గాత్రం.. లాలిపాటలో అమ్మప్రేమను.. విరహ గీతంలో ఎదురు చూపులు.. జానపదంలో హుషారును ఒలికించడమే కాకుండా… చిన్న పిల్లల గొంతు నుండి పక్షి కూతలకు సైతం తన గొంతుతో ప్రాణం పోసిన అసాధారణ ప్రతిభాశాలి జానకమ్మ.

ఎస్ జానకి
ఎస్ జానకి

పదహారేళ్ల వయసు సినిమాలో ఆమె పాడిన ‘సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా’ ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రేడియోలో జానకమ్మ పాట వస్తుందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా చెవులు రిక్కించి వినేవారు. అయితే ఇప్పుడా గాత్రం మూగబోయింది. 60 ఏళ్ల పాటు తన గాత్రంతో భారతీయులను అలరించిన ఎస్ జానకి (88) శనివారం మృతి చెందారు. సిరిమల్లె పువ్వు నేలరాలినా.. ఆ పుష్పం వెదజల్లిన సువాసన అజరామరం. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన అమృత గాత్రంతో ఒక వెలుగు వెలిగిన దిగ్గజ గాయని ఎస్. జానకమ్మ స్వర ప్రయాణం అసాధారణమైనది. తెలుగు నేలపై పుట్టి (ఆంధ్రప్రదేశ్‌లోని రేపల్లెలో), యావత్ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన జానకమ్మ ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో సాధించిన అరుదైన ఘనతలు, అందుకున్న అత్యున్నత అవార్డుల వివరాలు ఇవే.

అసాధారణ ఘనతలు

17 భాషల్లో వేలాది పాటలు: ఎస్. జానకి కేవలం దక్షిణాది భాషలకే పరిమితం కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఒరియా, బెంగాలీ, ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ వంటి దాదాపు 17 భాషల్లో 48 వేలకు పైగా అద్భుత గీతాలను ఆలపించారు.

స్వర విన్యాసాల దిట్ట: కేవలం ఒకే శైలికి పరిమితం కాకుండా.. చిన్న పిల్లల గొంతును అనుకరించడం, పక్షుల కూతలను గొంతుతో పలకడం, తాగుబోతు పాత్రల హావభావాలను గొంతులోకి తేవడం వంటి అద్భుతమైన స్వర విన్యాసాలు చేయడంలో జానకమ్మకు సాటి ఎవరూ లేరు. సంగీత దర్శకురాలిగా..: ఉషాగ్రాండ్ మూవీస్ నిర్మించిన ‘మౌనపోరాటం’ (1988) చిత్రానికి ఆమె అద్భుతమైన సంగీతాన్ని అందించి సంగీత దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకున్నారు.

అత్యున్నత పురస్కారాలు – అవార్డులు

జానకమ్మ తన సుదీర్ఘ ప్రయాణంలో 4 జాతీయ అవార్డులు, 33 వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకున్నారు. కన్నడ చిత్రసీమకు చేసిన సేవలకు గానూ మైసూర్ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1997 లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ (సౌత్), సైమా (SIIMA) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అందుకున్నారు.

పద్మభూషణ్ తిరస్కరణ

2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారు. దక్షిణాది కళాకారులకు చాలా ఆలస్యంగా గుర్తింపు ఇస్తున్నారని, ఐదు దశాబ్దాలకు పైగా సేవ చేసిన తనకు అభిమానుల ప్రేమే పెద్ద అవార్డని చెప్తూ ఆ పురస్కారాన్ని నిరాకరించి వార్తల్లో నిలిచారు. నేడు ఆ భౌతిక కాయం మన మధ్య లేకపోయినా, ఆమె సాధించిన ఈ మైలురాళ్లు, అందించిన అమర గీతాలు భారతీయ సంగీత చరిత్రలో సజీవంగా ఉంటాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *