Last Updated:
hyd news today
సమతామూర్తి ప్రాంగణానికి వెళ్లే భక్తులు, సందర్శకులకు ఇక మరో సరికొత్త అనుభూతి అందనుంది. ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు, పూజా కైంకర్యాలను ఆధునిక సాంకేతికతతో కళ్లముందుకు తీసుకొచ్చేలా కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏఆర్, వీఆర్, ఎంఆర్, ఎక్స్ఆర్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించిన ఈ సేవలను పరమపూజ్య శ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ ఆవిష్కరించారు.
4పాయింట్2 టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సాంకేతిక సేవల ద్వారా సమతామూర్తి ఆలయ చరిత్రతో పాటు ప్రాచీన వారసత్వ కథలను 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ అనుభవంలో వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాదు.. సుప్రభాతం, అభిషేకం, అలంకారం, హారతి, ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా ఇమ్మర్సివ్ వీఆర్ అనుభవంగా అందిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. వెయ్యేళ్ల క్రితం నాటి రామానుజాచార్యుల కాలాన్ని, అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడే ఆయన చేసిన కార్యం ఎంత కష్టసాధ్యమో అర్థం చేసుకోగలమని అన్నారు. సమాజ సంస్కరణలో రామానుజాచార్యుల పాత్రను గుర్తుచేస్తూ.. దాదాపు వెయ్యేళ్ల క్రితమే సమాజ నిర్వహణా వ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్ను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
మరోవైపు 4పాయింట్2 టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ, ఫౌండర్ కే. శివకుమార్ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో పర్యాటకం అంటే కేవలం ఒక ప్రదేశాన్ని చూడటం మాత్రమే కాదని అన్నారు. తాము చూస్తున్న ప్రదేశం వెనుక ఉన్న చరిత్ర, కథలను అర్థం చేసుకోవడానికి సందర్శకులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఆధునిక సాంకేతికత ద్వారా చరిత్రను నేటి తరానికి సులభంగా అర్థమయ్యే విధంగా అందించడమే తమ ఉద్దేశమని, భౌతిక అనుభవాన్ని భర్తీ చేయడం కాదని స్పష్టం చేశారు.
వాస్తవ ఆలయ పరిసరాలు, పూజా కైంకర్యాలను యథాతథంగా రికార్డు చేసి ఈ వీఆర్ అనుభవాన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఇందులో వీఎఫ్ఎక్స్, సీజీఐ లేదా డిజిటల్ గ్రాఫిక్స్కు బదులుగా వాస్తవ దృశ్యాలనే ఉపయోగించినట్లు పేర్కొంది. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి భక్తులు, సందర్శకులకు మరింత ఇంటరాక్టివ్ అనుభూతిని అందించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యమని తెలిపింది.














