Sanju Samson: జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయమే.. ప్రాణం పోయినా ఆ పని చేసేది లేదు: సంజూ సామ్సన్ | క్రీడా వార్తలు | ACTPnews

సంజూ సామ్సన్, గంభీర్


Last Updated:

Sanju Samson: భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో టి20 అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ పని చేసేదే లేదంటూ స్పష్టం చేశాడు.

సంజూ సామ్సన్, గంభీర్
సంజూ సామ్సన్, గంభీర్

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. గత కొంతకాలంగా తన బ్యాటింగ్ ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు మైదానంలో బ్యాట్‌తోనే దీటైన సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం సంజూ సామ్సన్ తన కెరీర్, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, జట్టు ఎంపికల వెనుక ఉండే వాస్తవాలపై పలు కీలక విషయాలను పంచుకున్నాడు.

అంత సులభం కాదు

తన 11 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను, విలువైన పాఠాలను చూశానని సంజు తెలిపాడు. “భారత జట్టు తరఫున ఆడుతున్నప్పుడు కొద్దిపాటి వైఫల్యాలు ఎదురైనా విమర్శలు వెల్లువెత్తడం సహజం. ఒక టీమిండియా క్రికెటర్‌గా ఆ స్థాయి ఒత్తిడిని, విమర్శలను తట్టుకోవడం ఏమాత్రం సులభం కాదు. కానీ, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నాకు గత అనుభవం ఎంతగానో అండగా నిలుస్తుంది. బయట ప్రజలు, నిపుణులు మాట్లాడే ప్రతి మాటా మనసుపై ప్రభావం చూపుతుందనేది వాస్తవం. అందుకే ఆ విమర్శలను వీలైనంత వరకు పక్కన పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాను” అని సంజూ వివరించాడు.

విమర్శలకు భయపడి ఆట శైలిని మార్చుకోబోనని స్పష్టం చేస్తూ, “ప్రతి మ్యాచ్‌లోనూ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి పరుగులు చేయడానికే చూస్తాను. ఒకవేళ విఫలమైతే మళ్లీ నాపై విమర్శల దాడి జరుగుతుందని తెలిసినప్పటికీ, జట్టు ప్రయోజనాల కోసం మైదానంలో రిస్క్ తీసుకుని ఆడడానికే మొగ్గు చూపుతాను” అని తేల్చిచెప్పాడు.

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

ఒక ఆటగాడు పరుగులు చేయనప్పుడు జట్టు నుంచి తప్పించడం నూటికి నూరు శాతం సమర్థనీయమేనని సంజూ సామ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. “ఒక జట్టు కెప్టెన్‌గా ప్లేయర్ల ఎంపిక విషయంలో మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి కఠిన సవాళ్లు ఎదురవుతాయో నాకు బాగా తెలుసు. నేను స్వయంగా కెప్టెన్సీ చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఒక నాయకుడి దృష్టిలో ఎల్లప్పుడూ జట్టు గెలుపే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. నా పరిధిలో లేని విషయాల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోను. దేశం కోసం, టీమ్ కోసం ఆడుతున్నప్పుడు అందరి ఏకైక లక్ష్యం మ్యాచ్ గెలవడమే. ఆ తర్వాతే వ్యక్తిగత మైలురాళ్లు లేదా ప్రయోజనాలు ఉంటాయి” అని స్పష్టం చేశాడు.

ఆ సమయంలో గంభీర్ అండగా నిలిచాడు

జట్టులో పోటీ, మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకున్న ఓ ఉదాహరణను సంజు ప్రస్తావించాడు. “పదహారేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వరుసగా భారీ స్కోర్లు చేస్తూ తుది జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతకుముందే నేను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచినప్పటికీ, ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాను. మరోవైపు యువ ఆటగాడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆ తరుణంలో నన్ను పక్కన పెట్టి అతడికి అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ పరంగా, కెప్టెన్సీ కోణంలో ముమ్మాటికీ సరైనదే” అని అన్నాడు.

అలాగే జట్టులో మార్పులు చేసే సమయంలో నాయకత్వ విభాగం వ్యవహరించే తీరుపై మాట్లాడాడు. “ఐపీఎల్‌లో ఇలాంటి మార్పులు ఎన్నో చూశాను. అయితే తుది జట్టు నుంచి తప్పించాలనుకుంటున్న ఆటగాడితో నేరుగా, స్పష్టంగా మాట్లాడి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆ విషయంలో అత్యంత స్పష్టతతో వ్యవహరించారు. ఆ సమయంలో నాతో సుదీర్ఘంగా మాట్లాడి పూర్తి వివరణ ఇచ్చారు” అని సంజూ సామ్సన్ వెల్లడించాడు. మైదానంలో తన బాధ్యతలను గుర్తిస్తూ జట్టు విజయాల కోసం పూర్తి నిబద్ధతతో శ్రమిస్తానని ఈ సందర్భంగా సంజూ స్పష్టం చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed