గంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (చైతన్య కృష్ణ) ఒక పబ్ దగ్గర మాటు వేసి, సరిగ్గా తమలాగే ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేస్తారు. ఒకే పోలికలతో ఉన్న ఈ ఆరుగురి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటనేదే ఈ సీజన్ ప్రధాన ఇతివృత్తం.
నిజ జీవితంలో రవి రాజకీయాలపై మోజుతో ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు పోగొట్టుకుని, భార్య హైమా పెట్టే టార్చర్ భరించలేక గేటెడ్ కమ్యూనిటీలో కాలం వెళ్లదీస్తుంటాడు. రచయిత అయిన రాహుల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయి, భార్య మాధురిని ఫేస్ చేయలేక హైదరాబాద్ వస్తాడు. మరోవైపు విక్రమ్‌కు అతని భార్య రేఖ విడాకులు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతుంది. పెళ్లి, సంసార జీవితాలపై తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఈ ముగ్గురూ ఒకరోజు మద్యం మత్తులో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని బూతులు తిడతారు.
అయితే వీరి బాధలను గమనించిన ఇంద్రుడు.. భూలోక పరిస్థితులను చక్కదిద్దేందుకు తన దూత అయిన గుప్తాను పంపిస్తాడు. ఏడు లోకాలను పరిశీలించిన గుప్తా.. మొదటి లోకంలో కష్టాలు పడుతున్న రవి, రాహుల్, విక్రమ్‌లను.. సర్వ సుఖాలు అనుభవిస్తున్న రెండో లోకంలోని వారి డూప్లికేట్స్తో ‘స్వాప్’ (పాత్రలను పరస్పరం మార్చడం) చేస్తాడు. ఆ తర్వాత రెండు లోకాల మధ్య జరిగిన గందరగోళం ఏమిటి? ఈ లోకం భర్తలు ఆ లోకానికి వెళ్లాక ఏం జరిగింది? ఆ లోకం వారు ఇక్కడికి వచ్చి ఎలాంటి వింతలు చేశారు? చివరికి ఎవరు ఏ లోకంలో స్థిరపడ్డారు? అనే ఆసక్తికరమైన అంశాలతో మిగతా కథ సాగుతుంది.
గత రెండు సీజన్లలో కేవలం భార్యాభర్తల మధ్య ఉండే ఈగోలు, గొడవల చుట్టూ కథను నడిపించిన మేకర్స్.. ఈసారి ఫాంటసీ, బాడీ స్వాపింగ్ ఎలిమెంట్స్‌ను జోడించి కథకు సరికొత్త ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. ‘మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు’ అనే పాత నానుడికి, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ లాంటి సోషియో ఫాంటసీ సినిమాల లైన్‌ను జోడించి దర్శకుడు శ్రీరామ్ ఎరగం స్క్రీన్ ప్లేను అద్భుతంగా డిజైన్ చేశారు. మొదటి రెండు ఎపిసోడ్లు పాత్రల పరిచయానికి, కథా స్థాపనకు సమయం తీసుకోవడం వల్ల కాస్త నిదానంగా సాగుతాయి. అయితే, మూడో ఎపిసోడ్ నుండి అసలైన కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ముఖ్యంగా నాలుగు, ఐదు ఎపిసోడ్లలో రెండు లోకాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించిన విధానం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ లోకంలో స్వతంత్రంగా, డామినేటింగ్‌గా ఉండే భార్యలు.. ఆ లోకంలో భర్తలకు బానిసల్లా బతకడం, అలాగే ఇక్కడ సాఫ్ట్‌గా ఉండే భర్తలు అక్కడ శాడిస్టులుగా ప్రవర్తించడం వంటి కాంట్రాస్ట్ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.
ప్రధాన పాత్రధారులైన ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణలకు ఈ సీజన్లో డ్యూయల్ షేడ్స్ చూపించే మంచి అవకాశం దొరికింది. తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో వీరు పాజిటివ్, నెగెటివ్ పాత్రల్లో ఇరగదీశారు. అయితే ఈ సీజన్ క్లైమాక్స్‌ను మాత్రం నటి రోహిణి పూర్తిగా హైజాక్ చేసిందని చెప్పాలి. ఆమె ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో విజిళ్లు వేయించే రేంజ్లో ఉన్నాయి. ఇక ఇంద్రుడిగా వెన్నెల కిషోర్, గుప్తాగా గుండు సుదర్శన్ తమ నటనతో నవ్వులు పూయించారు. గంగవ్వ, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష వర్ధన్, అభయ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
సాంకేతికంగా చూస్తే.. ఈ సిరీస్ నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్లోని ఫన్ను, ఎమోషన్‌ను పర్ఫెక్ట్గా ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్ విజువల్స్‌ను కలర్ఫుల్గా చూపించింది. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉండటం ప్లస్ పాయింట్. కొన్ని చోట్ల డైలాగ్స్ కాస్త బోల్డ్‌గా అనిపించినప్పటికీ, ఓటీటీ కంటెంట్ పరిమితులకు లోబడే ఉన్నాయి. కేవలం వినోదమే కాకుండా.. పేరెంటింగ్, భార్యాభర్తల బంధం, మహిళా సాధికారతపై అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా అందించారు.
సరికొత్త బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్
ప్రియదర్శి, అభినవ్, చైతన్యల కామెడీ టైమింగ్
వెన్నెల కిషోర్, రోహిణిల హిలేరియస్ పర్ఫార్మెన్స్
క్లీన్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
ప్రారంభంలో మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త స్లోగా సాగడం
అక్కడక్కడా వినిపించే కొన్ని బోల్డ్ డైలాగ్స్
మొత్తంగా చూసుకుంటే.. ‘సేవ్ ది టైగర్స్ 3’ ఎలాంటి అశ్లీలత, అసభ్యత లేని ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వారాంతంలో కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ‘జియో హాట్‌స్టార్’లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఒక బెస్ట్ ఛాయిస్.
రేటింగ్ : 3.25












