SC Status: ‘మతం మారితే ఎస్సీ హోదా పోతుంది’.. మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

SC Status: ‘మతం మారితే ఎస్సీ హోదా పోతుంది’.. మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


ఈ కేసేంటి? వివాదం ఎక్కడ మొదలైంది?:

ఈ కేసు 2021 సంవత్సరం నాటిది. ఆంధ్రప్రదేశ్‌ లోని బాపట్ల జిల్లా.. పిట్లవానిపాలెం మండలం.. కొత్తపాలెం గ్రామంలో ఇది మొదలైంది. ఆ గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్.. పాస్టర్‌గా చేస్తూ, ప్రతి ఆదివారం క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఓ రోజు ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్తున్న టైంలో తనపై అక్కల రామిరెడ్డి సహా ఐదుగురు దాడి చేసి, కులం పేరుతో తిట్టారని ఆరోపిస్తూ ఆనంద్, చందోలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC/ST Prevention of Atrocities Act) కింద కేసు రాశారు.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!

ఈ కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చెయ్యడాన్ని నిందితులు.. హైకోర్టులో సవాలు చేశారు. ఆనంద్ తాను క్రైస్తవ మతస్థుడినని (పాస్టర్) తన కంప్లైంట్‌లో చెప్పినందున, అతనికి ఇక ఎస్సీ హోదా కానీ, అట్రాసిటీ చట్టం ద్వారా వచ్చే కఠినమైన చట్టపరమైన రక్షణ కానీ రావు అని రామిరెడ్డి తరపు లాయర్ వాదించారు. 2025లో ఏపీ హైకోర్టు ఈ వాదనను సమర్థించింది. సుమారు పదేళ్లుగా, బహిరంగంగా పాస్టర్‌గా పనిచేస్తూ క్రైస్తవాన్ని పాటిస్తున్న వ్యక్తికి ఎస్సీ/ఎస్టీ చట్టం ద్వారా రక్షణ రాదనీ, అందువల్ల ఆ చట్టం కింద రాసిన క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు:

హైకోర్టు కేసును కొట్టివేయడంతో ఆనంద్.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. లైవ్ లా ప్రచురించిన న్యాయపరమైన పత్రాల ఆధారంగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 24న దీనిపై విచారణ జరిపి చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వుల్లోని క్లాజ్-3 గురించి న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలను (క్రైస్తవం, ఇస్లాం తదితర) స్వీకరించి ఆచరించే ఎవరికైనా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా తక్షణమే రద్దవుతుందని ధర్మాసనం అత్యంత స్పష్టంగా తెలిపింది. కుల వ్యవస్థ అనేది క్రైస్తవ మతంలో లేదనీ, ఒక వ్యక్తి మతం మారిన మరుక్షణమే చట్టం దృష్టిలో అతని ఎస్సీ హోదా రద్దవుతుందని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. అందువలన అతనికి ప్రభుత్వాలు అందించే రిజర్వేషన్లు గానీ, అట్రాసిటీ చట్టం వంటి ప్రత్యేక రక్షణ గానీ వర్తించవని చెబుతూ, హైకోర్టు తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు.

ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒకసారి ఈ తీర్పును రివ్యూ చెయ్యాలని కోరుతూ ఆనంద్ రివ్యూ పిటిషన్ వేశారు. అందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇదివరకు ఇచ్చిన తీర్పులో లోపాలేమీ లేవని చెప్పింది. రివ్యూ అవసరం లేదని తెలిపింది.

బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్వర్యంలోని జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఈ కేసుపై విచారణ జరిపి, ఆనంద్, క్రైస్తవాన్ని ఆచరిస్తున్నట్లు పూర్తి ఆధారాలతో నిర్ధారణ కావడంతో ఆయనకు ఉన్న ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని (SC Caste Certificate) ఇటీవలే అధికారికంగా రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇలా ఒక ఎస్సీ సర్టిఫికెట్ అధికారికంగా రద్దు కావడం రాష్ట్ర్రంలో బహుశా ఇదే తొలిసారి.

మొత్తంమీద సుప్రీంకోర్టు నిర్ణయం న్యాయవ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. రాజ్యాంగ నిబంధనలు ఎస్సీ వర్గాలకు కల్పించిన చారిత్రక హక్కులు, రక్షణలు కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను ఆచరించే వారికి మాత్రమే పరిమితమనీ, ఇతర మతాలకు మారిన దళిత క్రైస్తవులు, ముస్లింలు ఈ హోదాను చట్టబద్ధంగా పొందలేరని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా దేశానికి గట్టి సందేశాన్ని ఇచ్చింది. ఇది రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అమలుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed