Secret Soldier Movie Review: ‘సీక్రెట్ సోల్జర్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో బయటకు కనిపించని ఎన్నో రహస్యాలు, కుట్రలు ఉంటాయి. అలాంటి ఓ సీక్రెట్ మిషన్ చుట్టూ కథను అల్లుకుని తెరకెక్కిన చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ఒక డిఫెన్స్ లీక్ వెనుక దాగి ఉన్న రాజకీయ, క్రిమినల్ నెట్‌వర్క్‌ను తెరపైకి తీసుకురావడంతో ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా ఆసక్తిని పెంచుతుంది.

News18
News18

దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో బయటకు కనిపించని ఎన్నో రహస్యాలు, కుట్రలు ఉంటాయి. అలాంటి ఓ సీక్రెట్ మిషన్ చుట్టూ కథను అల్లుకుని తెరకెక్కిన చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ఒక డిఫెన్స్ లీక్ వెనుక దాగి ఉన్న రాజకీయ, క్రిమినల్ నెట్‌వర్క్‌ను తెరపైకి తీసుకురావడంతో ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా ఆసక్తిని పెంచుతుంది. దేశభక్తి, స్నేహం, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అంశాలను కలిపి దర్శకుడు కథను నడిపించిన విధానం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

కథ:

నెల్లూరుకు చెందిన వలి (నిహాల్ కోదాటి) దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఒక కేసులో చిక్కుకుని ‘ఉగ్రవాది’ అనే ముద్రను ఎదుర్కొంటాడు. అతని జీవితంలో చోటుచేసుకున్న ఈ పరిణామం వెనుక అసలు కారణం ఏంటి? ఇదే సమయంలో దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారిన ఓ సీక్రెట్ డిఫెన్స్ లీక్ మిషన్‌లో వలి భాగస్వామి అవుతాడు. ఈ మిషన్‌లో అతడికి ఎదురయ్యే సమస్యలు, బయటపడే రహస్యాలు, ఊహించని పరిణామాలే మిగతా కథను నడిపిస్తాయి.

కథనం ఎలా ఉంది?

డిఫెన్స్ లీక్‌ను కేవలం ఒక క్రైమ్‌గా కాకుండా, దాని వెనుక పనిచేసే పొలిటికల్, క్రిమినల్ నెట్‌వర్క్‌తో లింక్ చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. కథలో దేశభక్తిని ఓవర్‌డోస్ చేయకుండా, దానికి స్నేహం, వ్యక్తిగత భావోద్వేగాలను జోడించడం బాగుంది. ముఖ్యంగా సినిమా మొత్తం ‘రా అండ్ రియలిస్టిక్’ టోన్‌లో సాగడం స్పై థ్రిల్లర్‌కు మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది.

ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను, సమస్యను పరిచయం చేస్తూ కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కథన వేగాన్ని పెంచారు. డొంకతిరుగుడు లేకుండా నేరుగా సాగే కొన్ని సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్, మిషన్‌కు సంబంధించిన సన్నివేశాలు స్పై థ్రిల్లర్ అభిమానులకు మంచి మైండ్ గేమ్‌లా అనిపిస్తాయి. అయితే డిఫెన్స్ లీక్ వెనుక ఉన్న ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను మరింత లోతుగా చూపించి ఉంటే కథకు ఇంకాస్త బలం చేకూరేది.

నటీనటుల ప్రతిభ:

నిహాల్ కోదాటి తన పాత్రలో మంచి పరిణతిని చూపించాడు. సస్పెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పరిస్థితులకు అనుగుణంగా పాత్రలో వచ్చే మార్పులను హావభావాలతో బాగా పలికించాడు. పృథ్వి పాత్రలో సూర్య శ్రీనివాస్ కూడా మెప్పించారు. కమల్ కామరాజు, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు తమ అనుభవంతో సినిమాకు అవసరమైన సీరియస్‌నెస్‌ను తీసుకొచ్చారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు ఎంచుకున్న రియలిస్టిక్ ట్రీట్‌మెంట్ సినిమాకు ప్రధాన బలం. భారీ సెట్స్‌పై ఆధారపడకుండా సాధారణ లొకేషన్లలోనే ఇంటెలిజెన్స్, సీక్రెట్ మిషన్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం బాగుంది. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టుగా సాగింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో ఉత్కంఠను మరింత పెంచింది. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త షార్ప్‌నెస్ ఉంటే ఇన్వెస్టిగేషన్ సీన్ల పేసింగ్ మరింత వేగంగా ఉండేది.

ముగింపు:

‘సీక్రెట్ సోల్జర్’ భారీ యాక్షన్, ఫాంటసీ అంశాలతో నిండిన స్పై సినిమా కాదు. వాస్తవికతకు దగ్గరగా ఉండే నేషనల్ సెక్యూరిటీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. దేశభక్తి, స్పై మిషన్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశముంది. కొన్ని చోట్ల మరింత లోతైన కథనం, షార్ప్ ఎడిటింగ్ ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది.

రేటింగ్: 3/5



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports