Last Updated:
సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సిగ్మా’ (SIGMA). నేడే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సిగ్మా’ (SIGMA). లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాను మైత్రి మేకర్స్, ఎన్‌వీఆర్ సంస్థలు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ (అక్టోబర్ 2, 2026న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి డైరెక్టర్‌గా తొలి సినిమాతో జాసన్ ఎలా మెప్పించాడు? సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? కథ, కథనాల మాట ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
గురు (సందీప్ కిషన్) తన తండ్రి చేసిన అప్పుల ఊబిలో కూరుకుపోయి, తన తల్లి జ్ఞాపకార్థం ఉన్న లైబ్రరీని కాపాడుకునేందుకు కష్టపడుతుంటాడు. ఆ లైబ్రరీ నుంచే ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న క్రమంలో, వాయిస్ ఓవర్ కోసం ఆర్జే సామ్ (ఫరియా) పరిచయం ఏర్పడుతుంది. ఆపై, అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగి లైబ్రరీని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో విన్సెంట్ (శివ్ పండిట్) నడిపే గ్యాంబ్లింగ్ అడ్డాకు వెళ్లి గురు తన డబ్బునంతా పోగొట్టుకుంటాడు గురు. అంతలోనే అతనికి ఒక కీలకమైన పెన్ డ్రైవ్, కీ దొరుకుతాయి. ఆ కీ కోసం వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్), వై (యోగ్ జపీ) వెతుకుతూ ఉంటారు. అసలు పెన్ డ్రైవ్, కీ లో ఏముంది? ఈ మాఫియా నుంచి గురు ఎలా బయటపడ్డాడు? తన లైబ్రరీని తిరిగి ఎలా దక్కించుకున్నాడు? అన్నదే ఈ సినిమా మెయిన్ కథ.
విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తొలి సినిమా కావడంతో నేరేషన్ పరంగా కాస్త తాడనాడినా.. తాను చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగానే ప్రెజెంట్ చేశాడు. మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ పై దృష్టి పెట్టాడు కానీ స్క్రిప్ట్, లాజిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే సినిమా రేంజ్ మారిపోయేది. ఫస్టాఫ్ అంతా హీరో కష్టాలు, హీరోయిన్ పరిచయం లాంటి సన్నివేశాలతో నెమ్మదిగా సాగుతుంది. పెన్ డ్రైవ్ చుట్టూ తిరిగే ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్త ఆసక్తిని రేకెత్తించగా, సెకండాఫ్ లోనే అసలు కథ రివీల్ అవుతుంది. థ్రిల్లర్ కు అవసరమైన సీరియస్ నెస్, వావ్ అనిపించే ట్విస్టులు ఎక్కడా కనిపించవు, అయినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఎంగేజ్ అయ్యేలా కథ నడిపించారు. క్లైమాక్స్ సీన్స్ ఇంకాస్త పదునుపెట్టి రాసుకొని ఉంటే బాగుండేది.
గురు పాత్రలో బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ కు తగ్గట్టుగా సందీప్ కిషన్ నటించాడు. కామెడీ, యాక్షన్ సీన్స్ లో తనదైన మార్క్ చూపించాడు. ఫరియా పాత్ర నిడివి తక్కువే అయినా.. స్క్రీన్ పై ఆమె ఉన్నంతసేపు ఫ్రెష్ గా అనిపిస్తుంది. సంపత్ రాజ్, శివ్ పండిట్, రాజు సుందరం తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. తమన్ అందించిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని కొంత పెంచాయి. ఎడిటింగ్ కూడా ఓకే.
కేవలం యాక్షన్, కొన్ని కామెడీ ట్రాక్స్, తమన్ ఆర్ఆర్ కోసం టైమ్ పాస్ గా ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్: 3














