Last Updated:
94 ఏళ్ల వయసులోనూ దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు తన సృజనాత్మకతకు పదును తగ్గలేదని మరోసారి నిరూపించడానికి ప్రేక్షకులు ముందుకు ‘సింగ్ గీతం’ అంటూ సరికొత్త ప్రయోగంతో వచ్చాడు.
94 ఏళ్ల వయసులోనూ దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు తన సృజనాత్మకతకు పదును తగ్గలేదని మరోసారి నిరూపించడానికి ప్రేక్షకులు ముందుకు ‘సింగ్ గీతం’ అంటూ సరికొత్త ప్రయోగంతో వచ్చాడు. ఫాంటసీ, కామెడీ, మ్యూజికల్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మించాయి. కల్కీ దర్శకుడు నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ‘మాటలే పాటలైతే’ అనే విభిన్నమైన ఆలోచనతో రూపొందింది. మరి సింగీతం ప్రేక్షకులను మైమరిపించాడా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
కథ విషయానికి వస్తే.. జైలు నుంచి విడుదలైన ప్రతాప్ అలియాస్ ఆయాన్ తన తండ్రి రాసిచ్చిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి కుబేరపురం అనే గ్రామానికి వెళ్తాడు. ఒకప్పుడు పచ్చని అడవులతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు మైనింగ్ కారణంగా ఎడారిని తలపిస్తుంది. అక్కడ మిగిలిన చివరి భారీ చెట్టును గౌరి అలియాస్ అహల్య ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే బంగారం కోసం ఆ చెట్టును కూడా నరికివేయడంతో గ్రామంపై ఒక విచిత్రమైన శాపం పడుతుంది. అప్పటి నుంచి గ్రామస్తుల నోట మాటలు కాకుండా పాటలే వస్తుంటాయి. ఈ శాపం వెనుక కారణం ఏమిటి? గ్రామానికి విముక్తి ఎలా లభించింది? ఇందులో రేణు పాత్ర ఏంటి? అనేది మిగతా కథ.
సింగీతం శ్రీనివాసరావు ఎప్పటిలాగే సంప్రదాయాలకు భిన్నంగా ఆలోచించారు. ప్రకృతి విధ్వంసం, మానవ స్వార్థం, అత్యాశ వంటి అంశాలను ఫాంటసీ నేపథ్యంతో చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బంగారం కంటే పచ్చని చెట్టు విలువైనది అనే సందేశాన్ని బలంగా వినిపించారు. కుబేరపురం ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే సినిమా ప్రధాన కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉన్నా, మాటలన్నీ పాటల రూపంలో వినిపించడం కొంతమంది ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. తొలి భాగంలో కథనం కొంత నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. కానీ ద్వితీయార్ధంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలుస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే.. అయాన్, అహల్య, శాలిని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గౌరి పాత్రలో అహల్య అమాయకత్వాన్ని అద్భుతంగా పలికించింది. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్, తులసి తమ పాత్రలతో మంచి ముద్ర వేశారు. అనుదీప్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సాంకేతికంగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన బలం. ప్రతి మాటను పాటగా మార్చి ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నంలో ఆయన చూపిన ప్రతిభ ప్రశంసనీయం. నేపథ్య సంగీతం, విజువల్స్, ఆర్ట్ డిజైన్ సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
మొత్తంగా చూస్తే ‘సింగ్ గీతం’ కమర్షియల్ మసాలా సినిమా కాదు. కొత్త ఆలోచనలు, ప్రయోగాత్మక కథలు, భావోద్వేగాలతో కూడిన సినిమాలను ఇష్టపడే వారికి ఇది ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. సింగీతం శ్రీనివాసరావు సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వినూత్న ప్రయత్నం ఇది.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













