Last Updated:
Smith Machchhar: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని రీతిలో ఉగ్రవాది చొరబడి దాడికి పాల్పడగా, ప్రాణాలకు తెగించి పోరాడి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.
ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, తెగువకు మెచ్చిన ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర శౌర్య పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ను ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
సెప్టెంబరు 30న ఫ్లైదుబాయ్ విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో విమానం గాల్లో ఉండగా శ్వేతాంబె హమ్మామీ అనే ఉగ్రవాది అకస్మాత్తుగా కాక్‌పిట్‌లోకి చొరబడి దాడికి పాల్పడ్డాడు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, అత్యంత సమయస్ఫూర్తితో ఉగ్రవాదిని ప్రతిఘటించారు. ఈ పెనుగులాటలో స్మిత్‌కు సాయంగా ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులు ముందుకు వచ్చి నిందితుడిని బంధించడంలో సహకరించారు. ఈ పెను ప్రమాదం నుంచి విమానంలోని 27 మంది చిన్నారులు, నలుగురు అమెరికా పౌరులు సహా మొత్తం 172 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘర్షణలో గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం అబుధాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, స్మిత్ కోలుకున్న వెంటనే స్వయంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేయడం తమ దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ దాడిని అడ్డుకోవడంలో స్మిత్‌కు సహకరించిన ఆరుగురు పౌరులకు గురువారమే హీరోయిజం అవార్డులను అందజేశారు.
స్మిత్ మచ్చర్ సాహసంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది అమాయకుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్‌ను అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. మరోవైపు, కెప్టెన్ స్మిత్ గౌరవార్థం కేరళ తపాలా శాఖ ‘ప్రపంచ తపాలా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేసింది. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో కేరళ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ అమితాబ్ సింగ్ ఈ కవరును ఆవిష్కరించి, నగర మేయర్ వి.వి. రాజేశ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్మిత్ మచ్చర్ కుటుంబ సభ్యులు వర్చువల్‌గా హాజరయ్యారు. సంక్షోభ సమయంలో నిబ్బరం కోల్పోకుండా కెప్టెన్ స్మిత్ చూపిన కర్తవ్యనిష్ఠ యావత్ భారతావని గర్వపడేలా చేసింది.














