Snakes in Hyderabad: హైదరాబాద్‌ మొత్తం నాగు పాములే.. పదేళ్లలో ఎన్ని పాములను పట్టుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews

News18


Last Updated:

Snakes in Hyderabad: హైదరాబాద్‌లో CCMB, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అధ్యయనం, 2013-2022లో 55 వేల పాములు రక్షణ, 76 శాతం నాగుపాము, జెర్రిపోతు, నగరీకరణతో పాముల-మనుషుల భేటీలు పెరుగుతున్నాయి

News18
News18

హైదరాబాద్ మహానగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ ప్రభావం వన్యప్రాణులపై, ముఖ్యంగా పాముల జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రతినిధులతో కలిసి గత దశాబ్ద కాలంగా (2013 నుంచి 2022 వరకు) నగరంలో సేకరించిన గణాంకాలను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు, నగరవాసులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా..

ఆంధ్రప్రభ కథనం ప్రకారం గత పదేళ్లలో హైదరాబాద్ నగరవ్యాప్తంగా వివిధ నివాస ప్రాంతాలలో సుమారు 55,000 పాములను స్నేక్ క్యాచర్స్ రక్షించారు. నగర విస్తీర్ణం పెరగడం, అడవులు లేదా ఖాళీ స్థలాలు కనుమరుగై కాంక్రీట్ జంగిల్ పెరగడంతో పాములు తమ ఆవాసాలను కోల్పోయి నివాస గృహాల్లోకి వస్తున్నాయి. ఏటా పాములు తారసపడే ఘటనలు సగటున 8 నుంచి 10 శాతం పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

నగరంలో పట్టుబడిన పాముల్లో విస్తుపోయే నిజం ఏమిటంటే.. దాదాపు 76 శాతం కేవలం రెండు జాతులకు చెందినవే. అవి

నాగుపాము (Spectacled Cobra): ఇది అత్యంత విషపూరితమైనది. నగర వాతావరణానికి ఇది ఎంతగా అలవాటు పడిందంటే, డ్రైనేజీలు, శిథిలాలు, తోటల్లో ఇది సులువుగా మనుగడ సాగిస్తోంది.

జెర్రిపోతు (Rat Snake): ఇది విషం లేని పాము. ఎలుకలే ప్రధాన ఆహారంగా ఉండే ఈ పాములు, ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తుంటాయి.

ఈ రెండు జాతులు నగర జీవనానికి పూర్తిస్థాయిలో అలవాటు పడిపోయాయని సీసీఎంబీ అధ్యయనం స్పష్టం చేసింది. వర్షాకాలంలో, ముఖ్యంగా అక్టోబర్ నెలలో పాములు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. సంతానోత్పత్తి సమయం వర్షాల తర్వాత వచ్చే వెచ్చని వాతావరణం పాముల గుడ్లు పొదగడానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాల వల్ల భూమిలోని బొరియల్లోకి నీరు చేరడంతో, పాములు రక్షణ కోసం బయటకు వస్తాయి. ఈ సమయంలోనే మనుషులు, పాములు ఎదురుపడే సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.

చాలామంది పాములను చూడగానే భయంతో చంపేస్తుంటారు. కానీ, నగర పర్యావరణ వ్యవస్థలో పాములు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎలుకల జనాభాను నియంత్రించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒకవేళ నగరంలో పాముల సంఖ్య తగ్గితే, ఎలుకల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నగరవాసులకు సూచనలు: నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో మనం వాటి ఆవాసాల్లోకి ప్రవేశించాం కాబట్టి, పాములు ఎదురుపడటం సహజం. ఇలాంటి సమయాల్లో అనుసరించాల్సిన మార్గాలు.. పాము కనిపించగానే భయపడి దానిపై దాడి చేయవద్దు. చాలా పాములు తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ఎదురుదాడి చేస్తాయి. ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ వంటి స్వచ్ఛంద సంస్థల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. నిపుణులు వచ్చి వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఇంటి చుట్టూ చెత్తాచెదారం, పాత సామాన్లు లేకుండా చూసుకోవడం ద్వారా పాములు రాకుండా నివారించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports