శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారి దివ్య దర్శనం! | | ACTPnews

News18


Last Updated:

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ అశ్వ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.

+

News18

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు అశ్వ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. స్వామివారి వాహనసేవను తిలకించేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో కొలువుదీరిన శ్రీమలయప్ప స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. అశ్వ వాహనానికి ముందు గజరాజులు నడుస్తుండగా.. భక్త బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, జీయ్యంగార్ల ఘోషల నడుమ వాహనసేవ సాగింది. తిరుమాడ వీధుల్లో స్వామివారి వాహనం ముందుకు సాగుతుండగా భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ‘గోవిందా.. గోవిందా’ అంటూ చేసిన నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగాయి.

అశ్వ వాహన సేవకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఉపనిషత్తుల్లో ఇంద్రియాలను గుర్రాలతో పోల్చినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియంత్రించే నియామకుడిగా ఈ వాహనసేవ ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతారు.

కృష్ణయజుర్వేదంలో పరమాత్మను అశ్వ స్వరూపంగా పేర్కొన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. కల్కి స్వరూపంలో అశ్వ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారి దర్శనం భక్తులకు ప్రత్యేక సందేశాన్ని అందిస్తుంది. కలియుగంలో ఉండే దోషాలకు దూరంగా ఉంటూ, భగవంతుని నామస్మరణ, నామసంకీర్తనను ఆశ్రయించాలని ఈ సేవ అంతరార్థంగా తెలియజేస్తుందని టీటీడీ పేర్కొంది.

అశ్వ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ అశ్వ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కల్కి అలంకారంలో స్వామివారి దివ్యదర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండి, గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports